బలగం టీవీ, గంభీరావుపేట:
రాజన్న సిరిసిల్ల జిల్లా, గంభీరావుపేట మండలం, లింగన్నపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సృజనాత్మకతకు అద్దం పడుతూ ‘గునుగు పూలు’ పుస్తకావిష్కరణ మహోత్సవం ఘనంగా జరిగింది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు గంగారం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ పిట్ల ఎల్లం, గరిపల్లి అశోక్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
పాఠశాలలో చదువుతున్న 60 మంది విద్యార్థులు తమ ప్రతిభను చాటుకుంటూ, ఒక్కొక్క శీర్షికతో ఈ పుస్తకాన్ని రూపొందించారు. పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు కాలువ రాజయ్య, ముత్యాల సురేందర్ ల పర్యవేక్షణలో విద్యార్థులు రాసిన కవితలు, వ్యాసాల సమాహారమే ఈ ‘గునుగు పూలు’.
1974-75 బ్యాచ్‌కి చెందిన పాఠశాల పూర్వ విద్యార్థులు ఈ పుస్తక ముద్రణ ఖర్చును భరించడమే కాకుండా, విద్యార్థులను ప్రోత్సహిస్తూ పాఠశాలకు అవసరమైన మౌలిక వసతులను సమకూర్చి తమ కృతజ్ఞతను చాటుకున్నారు. ఈ సందర్భంగా పుస్తక రచనలో పాల్గొన్న విద్యార్థులకు ఉపాధ్యాయులు పిన్నులను అందజేసి అభినందించారు. అనంతరం సర్పంచ్ మరియు అతిథులను పాఠశాల యాజమాన్యం శాలువలతో సత్కరించింది. విద్యార్థులు ప్రదర్శించిన కోలాటం నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు బాలయ్య, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ చీకోటి సుభద్ర, పాలకవర్గ సభ్యులు, 1974 పూర్వ విద్యార్థులు ఆంజనేయులు, విష్ణు ప్రసాద్ రావు, మోహన్ రావు, దొంతిని మధుసూదన్ రావు, వంగలింగారెడ్డి, ఉపాధ్యాయ బృందం, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


