బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల :
- ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు చదువే ఆయుధం
- మెరుగైన ఫలితాల కోసం విద్యార్థులు నిత్యం సాధన చేయాలి
– కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
విద్యాలయంలోని ప్రతి తరగతి గదిని సందర్శించి, విద్యార్థులను ఏమైనా సమస్యలు ఉన్నాయా, భోజనం ఎలా ఉంది, ఉపాధ్యాయుల భోధన ఏ విధంగా ఉంది అని వివరాలను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా విద్యార్థుల ను అడిగి తెలుసుకున్నారు. ఆదివారం ఎల్లారెడ్డిపేట మండలం దుమాలలోని ఏకలవ్య రెసిడెన్షియల్ విద్యాలయాన్ని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యాలయంలోని తరగతి గదులు, డైనింగ్ హాల్, స్టోర్ రూమ్, టాయిలెట్స్, మైదానం, విద్యార్థులకు కల్పిస్తున్న ఇతర మౌలిక వసతులు, సదుపాయాల తీరును కలెక్టర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఎంచుకుని దానికి అనుగుణంగా ముందుకు సాగాలని, చదువే సమాజంలో విలువైన, అత్యుత్తమైన ఆయుధమని తెలిపారు. విద్యార్థులు చదువులో రాణించి, తమ తల్లిదండ్రుల పేరును నిలబెట్టాలని, చదువును మించిన ఆయుధం లేదని, కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని, పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమంగా రాణించాలని, మెరుగైన ఫలితాలు రావాలంటే ప్రతినిత్యం సాధన చేయాలని సూచించారు. విద్యార్థులకు అత్యుత్తమ భోధన అందిచడంతో పాటు అన్ని రకాల మౌలిక వసతులు, సౌకర్యాలను కల్పించాలని అధికారుల ను ఆదేశించారు.
డైనింగ్ హాల్ ను సందర్శించి, భోజన తయారీ విధానాన్ని, స్టోర్ రూమ్ నిర్వహణను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు.
విద్యాలయం పరిసరాల్లో ఉన్న గడ్డిని తొలగించి, మొత్తం శుభ్రం చేయించాలని గ్రామ పంచాయితీ కార్యదర్శిని ఆదేశించారు.
ఈ తనిఖీలో విద్యాలయం ఉపాధ్యాయులు, తదితరులు పాల్గోన్నారు.