బలగం టీవీ, ఆంధ్రప్రదేశ్:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ ఐఏఎస్ అధికారి కూతురు ఆత్మహత్య కేసు సంచలనం రేకెత్తిస్తోంది. ప్రేమ వివాహం చేసుకున్న ఎనిమిది నెలలకే ఏపీ ఎస్సీ కార్పొరేషన్ సెక్రటరీ చిన్న రాముడు కూతురు మాధురి సాహితి బాయి (27) తాడేపల్లిలోని తన పుట్టింట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై యువతి తండ్రి, భర్త పరస్పరం తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు.
తాడేపల్లిలోని నవోదయ కాలనీలో నివసించే సాహితి బాయి, సుమారు ఎనిమిది నెలల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన రాజేష్ నాయుడు అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే, పెళ్లయిన కొద్ది కాలానికే భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో, గత రెండు నెలల నుండి సాహితి బాయి తన తండ్రి వద్దే ఉంటోంది. ఈ క్రమంలో నిన్న ఆమె ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తన కూతురి మరణానికి అల్లుడు రాజేష్ నాయుడు వేధింపులే కారణమని ఐఏఎస్ అధికారి చిన్న రాముడు ఆవేదన వ్యక్తం చేశారు. భర్త వేధింపుల కారణంగానే తన కూతురు మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిందని ఆయన ఆరోపిస్తున్నారు.
మరోవైపు, సాహితి బాయి భర్త రాజేష్ నాయుడు మాత్రం ఇది ఆత్మహత్య కాదని, పరువు హత్య అని ఆరోపిస్తున్నాడు. తన భార్య ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, పైగా ఆమె గర్భవతి అని వెల్లడించారు. ఈ ప్రేమ వివాహం ఇష్టం లేని సాహితి బాయి తల్లిదండ్రులే ఆమెను హత్య చేసి, దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు.
తన భార్య మృతదేహాన్ని తనకు అప్పగిస్తే తానే అంత్యక్రియలు నిర్వహిస్తానని రాజేష్ నాయుడు తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని కోరుతూ ఆయన నంద్యాల ఎస్పీకి వినతి పత్రం కూడా అందజేశారు. ప్రేమ వివాదం, ఆత్మహత్య, అత్తింటి వేధింపులు, పరువు హత్య ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు ఏపీలో ప్రస్తుతం సంచలనంగా మారింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
