బలగం టీవీ, హైదరాబాద్:
రాష్ట్రంలో పోలీసులు అధికార పార్టీకి కొమ్ము కాస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఆవేదన వ్యక్తంచేశారు.మాజీ ఎంపీ, ప్రభుత్వ మాజీ విప్ బాల్క సుమన్ పై పోలీసులు అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పిదాలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్నందునే సుమన్ పై అక్రమ కేసులు పెడుతున్నారని ఎంపీ రవిచంద్ర ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన పోలీసులు పాలకుల మెప్పు పొందేందుకు ఏకపక్షంగా వ్యవహరిస్తుండడం శోచనీయమన్నారు. బెదిరింపులు, అదిరింపులు, వేధింపులు, దాడులు, అక్రమ కేసుల బనాయింపు, అరెస్టులకు బీఆర్ఎస్ శ్రేణులు భయపడరని ఎంపీ రవిచంద్ర స్పష్టం చేశారు. సుమన్ పై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించి, నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిందిగా డీజీపీ శివధర్ రెడ్డిని ఎంపీ వద్దిరాజు కోరారు.
