– కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు.
- వేములవాడ ఏరియా ఆసుపత్రి ఎదుట బాధితుల ఆందోళన
బలగం టీవీ, వేములవాడ:
వైద్యుల నిర్లక్ష్యంతోనే పసిబిడ్డ మృతి చెందిందని, తమ బిడ్డ మరణానికి కారణమైన వైద్యులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పసిబిడ్డ కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రి ఎదుట నిరసన చేపట్టారు. ఆసుపత్రికి నమ్మి వస్తే, వైద్యుల నిర్లక్ష్యం మాకు తీరని శోకాన్ని మిగిల్చింది అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదని ఆసుపత్రి ఆవరణలో ఆందోళన నిర్వహించడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. కోనరావుపేట మండలం పల్లిమక్త గ్రామానికి చెందిన చింద్రవేణి అనూష అనే గర్భిణి ప్రసవం కోసం ఐదు రోజుల క్రితం వేములవాడ ఏరియా ఆసుపత్రిలో చేరారు. కాగా, వైద్యులు ఆమెకు డెలివరీ చేయగా మగబిడ్డ జన్మించాడు. అయితే, శిశువు జన్మించినప్పటి నుండి వైద్యులు కనీస పర్యవేక్షణ చేయలేదని, సరైన వైద్య సేవలు అందించడంలో పూర్తిగా విఫలమయ్యారని బాధితులు ఆరోపించారు. వైద్యుల బాధ్యతారాహిత్యం వల్లే తమ బాబు మృతి చెందాడని నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వేములవాడ ఏరియా ఆసుపత్రిలో ఇలాంటి వివాదాలు తలెత్తడం ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా ఒక గర్భిణి ప్రసవం కోసం వస్తే, వైద్యులు అందుబాటులో లేరంటూ వెనక్కి పంపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆసుపత్రిలో వైద్య సేవల పట్ల రోజుకో ఫిర్యాదు బయటపడుతున్నా, ఉన్నతాధికారులు స్పందించకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం స్పందించి ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
