బలగం టివి,రాజన్న సిరిసిల్ల:
ప్రజాపాలన అభయహస్తం సన్నాక సమావేశానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని నాలుగు జిల్లాల సంబంధించిన జిల్లా పరిషత్ చైర్పర్సన్లను ఆహ్వానించకపోవడంపై వారు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. గురువారం నుండి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం ప్రజా పాలన మరియు అభయహస్తం పథకాల అమలుకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రజా పాలన విజయవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు రాష్ట్ర నీటిపారుదల పౌరసరఫరాల శాఖ మంత్రి నల్లమడ ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఇన్చార్జిగా నియమించింది. ఉత్తంకుమార్ రెడ్డి బుధవారం కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని ప్రజా ప్రతినిధులు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు జిల్లా కలెక్టర్లు ఎస్పీలు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి డిప్యూటీ క్యాబినెట్ ర్యాంక్ లో ఉన్న జిల్లా పరిషత్ చైర్పర్సన్లను ఆహ్వానించకపోవడం చర్చ నియాంశంగా మారింది. జిల్లా పరిధిలోని జగిత్యాల కరీంనగర్ సిరిసిల్ల పెద్దపల్లి జిల్లాలకు టిఆర్ఎస్ పార్టీకి చెందిన వారు జిల్లా పరిషత్ చైర్ పర్సన్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ నలుగురికి ఆహ్వానం అందకపోవటంపై వారు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ ప్రజాస్వామ్యము ప్రజల భాగస్వామ్యం తదితర అంశాలపై నిరంతరం మాట్లాడుతున్న, ఆచరణలో మాత్రం ఆ విలువలను పాటించడం లేదని జిల్లా పరిషత్ చైర్పర్సన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో స్థానిక సంస్థల్లో కీలకమైన స్థానంలో ఉన్న ప్రజాప్రతినిధులైన జడ్పి చైర్మన్ లను ప్రజాపాలన లాంటి ప్రజా సంబంధిత కార్యక్రమాల అమలు సన్నాక సమావేశానికి ఆహ్వానించకపోవడం ప్రభుత్వ ద్వంద్వ నీటికి నిదర్శనమని వారు ఆరోపిస్తున్నారు.