– కోరుకంటి చందర్
బలగం టీవీ, హైదరాబాద్:
రామగుండంలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా జరిగాయని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తీవ్రంగా ఆరోపించారు. అధికార కాంగ్రెస్ పార్టీ గుండాయిజంతో ఎన్నికలను నిర్వహించిందని ఆయన విమర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూనీ అయింది. ఇటువంటి ఎన్నికలు తెలంగాణ ప్రజలు ఎన్నడూ చూడలేదు. నా రాజకీయ జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురుకాలేదు” అని అన్నారు. నామినేషన్ దశ నుంచి ఓట్ల లెక్కింపు వరకు అధికార పార్టీ నాయకులు ఒత్తిళ్లు, బెదిరింపులు, అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు.
నామినేషన్ల సమయంలో తమ పార్టీ నాయకులను ఇబ్బందులకు గురి చేసి, విత్‌డ్రా చేసుకోవాలని బెదిరించారని తెలిపారు. విత్‌డ్రా చేయకపోతే తప్పుడు గంజాయి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారని పేర్కొన్నారు. పోలీసు యంత్రాంగం కూడా అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించిందని, “పోలీసులు కాంగ్రెస్ కండువా కప్పుకుంటే సరిపోతుంది” అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
స్ట్రాంగ్ రూముల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయడం అనుమానాలకు తావిచ్చిందని, ఏం జరిగిందో ఎవరికి అర్థం కాలేదని అన్నారు. రామగుండంలో జరిగిన ఎన్నికల తీరుపై సుమోటోగా కేసు నమోదు చేయాలని ఎలక్షన్ కమిషన్‌ను డిమాండ్ చేశారు. అలాగే డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.
ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్కు నిజాయితీ ఉంటే మళ్లీ ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు.
క్యాతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చిందని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. మంత్రి వివేక్ వెంకటస్వామి క్యాతనపల్లిలో మకాం వేసి అనవసర జోక్యం చేసుకుంటున్నారని విమర్శించారు.
చెన్నూరులో తమ పార్టీ నాయకులపై జరిగిన దాడి ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టువంటిదని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై తెలంగాణ మేధావులు స్పందించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ దుర్మార్గాలను ఖండించాలని కోరారు.
రాబోయే రోజుల్లో ప్రజలు తగిన తీర్పు ఇస్తారని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు తమ పోరాటం కొనసాగుతుందని కోరుకంటి చందర్ స్పష్టం చేశారు.
ఈ ప్రెస్ మీట్‌లో రామగుండం బీఆర్ఎస్ నేత బొడ్డు రవీందర్ పాల్గొన్నారు.
