బలగం టీవీ, ఖమ్మం:
“ఇందిరమ్మ రాజ్యం అంటే ఇళ్లు కట్టించడం కాదు.. ఉన్న ఇళ్లను కూల్చడమేనా?” అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ఖమ్మం వెలుగుమట్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఇళ్ల కూల్చివేత బాధితులను ఆయన శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితులు తమ కన్నీటి గాథలను కేటీఆర్ ముందు వెళ్లగక్కారు. ప్రభుత్వమే ఇచ్చిన పట్టాలు, ఆస్తి పన్ను రశీదులు, విద్యుత్ కనెక్షన్ పత్రాలు ఉన్నప్పటికీ, నోటీసులు ఇవ్వకుండా అర్ధరాత్రి వేళ దౌర్జన్యంగా ఇళ్లను కూల్చివేయడంపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
బాధితులు తమ వద్ద ఉన్న భూమి పట్టాలు, కోర్టు ఆర్డర్లు మరియు పన్ను రశీదులను కేటీఆర్‌కు చూపిస్తూ విలపించారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో జీవోల ప్రకారం దరఖాస్తు చేసుకుని నివసిస్తున్న తమను, ప్రస్తుత ప్రభుత్వం మెడలు పట్టి బయటకు గెంటేసిందని వారు వాపోయారు. దీనిపై స్పందించిన కేటీఆర్, కేవలం ఒక అధికారిని (ఆర్డీవో) బదిలీ చేస్తే సరిపోదని, బాధితులకు పూర్తిస్థాయిలో న్యాయం జరగాలని డిమాండ్ చేశారు.
“మీరు అధైర్యపడకండి.. ఏ ఇళ్లు అయితే కూల్చేశారో, అదే స్థలంలో మళ్లీ ఇళ్లు కట్టించి గృహప్రవేశం చేయించే బాధ్యత నాది” అని హామీ ఇచ్చారు. ఈ అన్యాయాన్ని శాసనసభ, శాసనమండలి వేదికలపై ప్రశ్నిస్తామని, అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళ్లి బాధితుల పక్షాన పోరాడుతామని స్పష్టం చేశారు. ప్రభుత్వం బాధితులను విడదీసే ప్రయత్నం చేస్తుందని, అందరూ కలిసికట్టుగా ఉంటేనే విజయం సాధించగలమని సూచించారు.
ఖమ్మంలో 150 ఇళ్లతో పాటు మహబూబ్ నగర్‌లో దివ్యాంగుల ఇళ్లను కూడా కూల్చివేయడం ఈ ప్రభుత్వ దుర్మార్గపు పాలనకు నిదర్శనమని కేటీఆర్ విమర్శించారు. చట్టపరమైన ఆధారాలు అన్నీ బాధితుల వైపు ఉన్నాయని, కలెక్టర్ మరియు చీఫ్ సెక్రటరీలను కలిసి ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎండగడతామని ఆయన భరోసా ఇచ్చారు. పేదల పక్షాన గట్టిగా నిలబడాలని కేసీఆర్ గారు తనకు ప్రత్యేకంగా సూచించారని కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.


