– పలువురు నాయకుల అభినందనలు
సిరిసిల్ల పురపాలక సంఘ కార్యాలయంలో శుక్రవారం నాడు సిరిసిల్ల మున్సిపల్ చైర్‌పర్సన్‌గా జిందం కళా చక్రపాణి పదవి బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించగా, పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు హాజరై శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా భారత రాష్ట్ర సమితి జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య మర్యాదపూర్వకంగా కలిసి చైర్‌పర్సన్‌ను శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. అలాగే కౌన్సిలర్ సభ్యులను కూడా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.
అదేవిధంగా NAFSCOB మాజీ చైర్మన్ కొండూరి రవీందర్ రావు పూజా కార్యక్రమంలో పాల్గొని చైర్‌పర్సన్‌ను కలిసి శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా వైస్ చైర్మన్ దార్ల సందీప్ కౌన్సిలర్ సభ్యులను సైతం సన్మానించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఇతర ప్రముఖులు కూడా పాల్గొన్నారు.
పదవి స్వీకరణ అనంతరం చైర్‌పర్సన్ జిందం కళా చక్రపాణి మాట్లాడుతూ.. తెలంగాణ తొలి ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆశీస్సులతో, గౌరవ శాసనసభ్యులు కల్వకుంట్ల తారక రామారావు సహకారంతో 2020–25 కాలంలో కౌన్సిలర్‌గా గెలిచి చైర్మన్‌గా సేవలందించానని తెలిపారు. ప్రస్తుతం మరోసారి కౌన్సిలర్‌గా గెలిచి చైర్‌పర్సన్ బాధ్యతలు చేపట్టడం తనకు గర్వకారణమని పేర్కొన్నారు.
ఈ పదవిని చేపట్టడంలో సహకరించిన కౌన్సిలర్ సభ్యులకు, మొదటి నుంచి అండగా నిలిచిన మూడో వార్డు ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ నమ్మకాన్ని నిలబెట్టేలా పారదర్శక పరిపాలన అందిస్తూ, సిరిసిల్లను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లి “స్వచ్ఛ సిరిసిల్ల”గా ఆదర్శ పురపాలక సంఘంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ఆమె స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎండి ఖాదీర్ పాషా, వైస్ చైర్మన్ దార్ల సందీప్, కౌన్సిలర్ సభ్యులు, అధికారులు మరియు పుర ప్రముఖులు, మీడియా విలేఖరులు తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.











