నిందితుడిని కఠినంగా శిక్షించాలని న్యాయవాదుల డిమాండ్..
సొంత చెల్లెలి చంపిన అన్న.. మొయినాబాద్‌లో కలకలం
బలగం టీవీ, రంగారెడ్డి:
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఆస్తి తగాదాలు తోడబుట్టిన బంధం కంటే ఎక్కువయ్యాయి. 10 ఎకరాల భూమి కోసం ఓ అన్న తన సొంత చెల్లెలిని, అది కూడా కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్న యువతిని గొంతు కోసి హత్య చేసిన ఉదంతం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన గొటికె శాంతయ్యకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు. చిన్న కూతురు స్వప్న (34) చేవెళ్ల కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తోంది, ఆమెకు ఇంకా వివాహం కాలేదు. తండ్రి శాంతయ్య మరణం తర్వాత, ఆయన పేరు మీదున్న 10 ఎకరాల భూమిని తల్లి వెంకటమ్మ పేరిట మార్చారు. అందులో 6 ఎకరాలను కుమారుడు రాజు పేరిట రిజిస్ట్రేషన్ చేయగా, మిగిలిన 4 ఎకరాలు తల్లి పేరిట ఉంచుకున్నారు.
ఏడాది క్రితం, తల్లి పేరు మీద ఉన్న ఆ 4 ఎకరాల భూమిని రాజు తన చెల్లెలికి తెలియకుండా అక్రమంగా తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న స్వప్న.. పోలీస్ మరియు రెవెన్యూ అధికారులను ఆశ్రయించి పోరాడింది. అక్రమ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయించి, ఆ భూమిని తిరిగి తన తల్లి పేరు మీదకు మార్పించింది. తల్లి పేరు మీద ఉన్న పొలంలో సర్వే చేయిస్తుండగా, నిందితుడు రాజు తన అనుచరులతో కలిసి అక్కడికి చేరుకున్నాడు. అందరూ చూస్తుండగానే కత్తితో స్వప్నపై విచక్షణారహితంగా దాడి చేసి, గొంతు కోసి పరారయ్యాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
గత నెలలో జరిగిన ఒక ప్రమాదంలో స్వప్న కాలు విరిగింది. అది యాక్సిడెంట్ కాదని, తన అన్నే తనను చంపేందుకు ప్రయత్నించాడని ఆమె అప్పట్లోనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై హత్యాయత్నం కేసు పెట్టిందన్న కోపంతో రాజు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు అతని స్నేహితుల మాటల ద్వారా తెలుస్తోంది. సహచర న్యాయవాది స్వప్న హత్యను నిరసిస్తూ చేవెళ్ల కోర్టు న్యాయవాదులు భారీ ఎత్తున పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు. నిందితుడు రాజును వెంటనే అరెస్ట్ చేసి, కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.
