బలగం టీవీ, కోదాడ:
సూర్యాపేట జిల్లా కోదాడలో దళిత యువకుడు కర్ల రాజేష్ మృతి చెందిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పోలీసుల చిత్రహింసల వల్లే రాజేష్ ప్రాణాలు కోల్పోయాడన్న ఆరోపణల నేపథ్యంలో ఉన్నతాధికారులు కఠిన చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో బాధ్యుడిగా భావిస్తూ కోదాడ రూరల్ సీఐ ప్రతాప్ లింగంను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే చిలుకూరు ఎస్ఐ సురేష్ రెడ్డిని జిల్లా పోలీసు కార్యాలయానికి (DPO) అటాచ్ చేశారు.
సీఎం రిలీఫ్ ఫండ్ (CMRF) చెక్కుకు సంబంధించిన ఒక చిన్న వివాదంలో ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన అమాయక దళిత యువకుడు కర్ల రాజేష్‌ను పోలీసులు అక్రమంగా కస్టడీలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజేష్‌ను సుమారు నాలుగు రోజుల పాటు పోలీస్ స్టేషన్‌లో ఉంచి, విచక్షణారహితంగా చిత్రహింసలు పెట్టారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. పోలీసుల దెబ్బలు తాళలేక రాజేష్ లాకప్‌లోనే మృతి చెందడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
ఈ అమానుష ఘటనపై తెలుగు స్క్రైబ్ ప్రచురించిన కథనం అధికారుల్లో కదలిక తెచ్చింది. ఈ ఘటనలో పాలుపంచుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏఎస్ఐ వెంకటేశ్వరరావు, హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లుపై కూడా శాఖాపరమైన విచారణ కొనసాగుతోంది. క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు అధికారుల పై వేటు వేశారు.
