జిల్లా స్థాయిలో గెలిచి రాష్ట్రస్థాయికి అర్హత…
బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
జిల్లా కేంద్రంలోని గోపాల్ నగర్ లో గల మహర్షి హైస్కూల్ విద్యార్థినులు క్రీడారంగంలో తమ సత్తా చాటారు. జిల్లా స్థాయి అండర్-16 బాలికల ఫుట్‌బాల్ పోటీలలో అద్భుత ప్రతిభ కనబరిచి, రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. పాఠశాలకు చెందిన విద్యార్థినులు సుకృత, శ్రీనిక, హాసిని, ఉపాసనలు మైదానంలో పట్టుదలతో ఆడి జిల్లా జట్టులో స్థానం సంపాదించడమే కాకుండా, రాష్ట్రస్థాయిలో ఆడేందుకు అర్హత సాధించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ బూర శ్రీనివాస్, ప్రిన్సిపాల్ శ్వేత విద్యార్థినులను ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించడం గర్వకారణమని, రాష్ట్రస్థాయిలో కూడా ఉత్తమ ప్రతిభ కనబరిచి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. విద్యార్థినుల విజయానికి సహకరించిన వ్యాయామ ఉపాధ్యాయులను, సిబ్బందిని ఈ సందర్భంగా అభినందించారు.

