క్రీడల తార సమీరా.. మల్లారెడ్డిపేట గ్రామానికి గర్వకారణం..
బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
క్రీడల్లో అద్భుతమైన ప్రతిభ చూపిస్తూ కొత్త రికార్డులు సృష్టిస్తూ, రాష్ట్ర స్థాయిలో విజయం సాధించి, యువతకు ప్రేరణగా నిలుస్తుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేట గ్రామానికి చెందిన పల్లె సమీరా క్రీడల్లో అద్భుత ప్రతిభ కనబరుస్తూ, కొత్త రికార్డులను సృష్టిస్తూ గ్రామానికి, జిల్లాకు గర్వకారణంగా నిలిచింది. చిన్ననాటి నుంచే క్రీడల పట్ల ఆసక్తి కలిగిన సమీరా, నిరంతర సాధన మరియు క్రమశిక్షణతో విశేష విజయాలను సాధిస్తోంది.
పాఠశాల స్థాయిలో ప్రారంభమైన క్రీడా ప్రయాణం ఇప్పుడు రాష్ట్ర స్థాయికి విస్తరించబడింది. ప్రతి పోటీలో ప్రత్యర్థులను ధైర్యంగా ఎదుర్కొని, ప్రేక్షకుల ప్రశంసలు పొందుతూ సమీరా తన ప్రతిభను మరోసారి ప్రదర్శించింది. పరిమిత వనరుల మధ్య కూడా వెనకడుగు వేయకుండా సాధన కొనసాగిస్తూ యువతకు ఆదర్శంగా మారింది.
సమీరా, మల్లారెడ్డిపేట గ్రామానికి చెందిన అమృత బాల రాజు దంపతుల కూతురు, పాఠశాల విద్య ఇంటర్మీడియట్ వరకు రామక్కపేట సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో పూర్తి చేసుకొని, ప్రస్తుతం తెలంగాణ ఆర్మ్డ్ ఫోర్స్ ప్రిపరేటరీ డిగ్రీ కాలేజ్ భువనగిరి లో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుకుంటోంది. తాజాగా, గత డిసెంబర్‌లో హైదరాబాదులోని గచ్చిబౌలిలో నిర్వహించిన 5 కిలోమీటర్ స్టేట్ లెవల్ రన్నింగ్ ఛాంపియన్షిప్ లో బంగారు పతకం గెలిచింది. అంతకుముందు సరూర్ నగర్ స్టేడియంలో 2 కిలోమీటర్ల రాష్ట్ర స్థాయి రన్నింగ్‌లో కూడా బంగారు పతకం సాధించింది. అలాగే, మహాత్మా గాంధీ యూనివర్సిటీ నిర్వహించిన స్టేట్ లెవల్ ఉమెన్స్ కబడ్డీ ఛాంపియన్షిప్ లో బంగారు పతకం, భద్రాద్రి కొత్తగూడెం టోర్నమెంట్‌లో సిల్వర్ పతకం సాధించింది.
గ్రామస్తులు సమీరాను అభినందిస్తూ, భవిష్యత్తులో రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం, క్రీడా సంఘాలు తగిన ప్రోత్సాహం అందిస్తే సమీరా మరింత ఉన్నత స్థాయికి చేరుతుందని అభిప్రాయపడ్డారు.

