క్రిప్టో కరెన్సీ పేరుతో భారీ మోసం: నలుగురు అరెస్ట్..

0
55

‘ఈగల్ కాయిన్’ పేరిట రూ. లక్షల్లో వసూళ్లు.. మూడు కార్లు, నాలుగు ఫోన్లు స్వాధీనం…

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:

క్రిప్టో కరెన్సీ మరియు మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో అమాయక ప్రజలను బురిడీ కొట్టించి లక్షలాది రూపాయలు వసూలు చేసిన ముఠాను సిరిసిల్ల పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఇన్స్పెక్టర్ కృష్ణ ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా సిరిసిల్ల పట్టణ ఇన్స్పెక్టర్ కృష్ణ మాట్లాడుతూ.. సిరిసిల్ల పట్టణానికి చెందిన కొంతమంది వ్యక్తులు ముఠాగా ఏర్పడి ‘ఈగల్ కాయిన్’ (Egal Coin) అనే ఆన్‌లైన్ కంపెనీ పేరుతో పెట్టుబడులు సేకరించడం ప్రారంభించారు. ఇది ఒక చైన్ సిస్టమ్ అని, ఇందులో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే అతి తక్కువ కాలంలోనే భారీ లాభాలు వస్తాయని నమ్మబలికారు. విద్యానగర్‌కు చెందిన ముచ్చ రాజేందర్ అనే వ్యక్తి వీరి మాటలు నమ్మి సుమారు 11 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాడు. 18 నెలల్లో 30 లక్షలు వస్తాయని నిందితులు హామీ ఇవ్వగా, బాధితుడికి కేవలం ఒక లక్షా ఇరవై వేల రూపాయలు మాత్రమే తిరిగి ఇచ్చారు. మిగిలిన డబ్బుల కోసం బాధితుడు నిందితులను నిలదీయగా, వారు సరైన సమాధానం చెప్పకపోవడంతో మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు ఆరుగురిపై కేసు నమోదు చేయగా, ప్రస్తుతం నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అరెస్ట్ అయిన వారిలో వంగరి వేణు గోపాల్ (40), ఆడెపు శ్రీధర్ (44), మంచికట్ల సుధాకర్ (42), దోమల ప్రవీణ్ (41) ఉన్నారు. మరో ఇద్దరు నిందితులు పాశికంటి లవన్ కుమార్, సుభాష్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. నిందితుల నుండి మోసానికి ఉపయోగించిన 3 KIA సోనేట్ కార్లు మరియు 4 స్మార్ట్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అధిక లాభాల ఆశ చూపే ఇటువంటి ఆన్‌లైన్ కంపెనీలు, క్రిప్టో స్కామ్‌ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. ‘ఈగల్ కాయిన్’ పేరుతో ఇంకెవరైనా మోసపోయి ఉంటే ధైర్యంగా ముందుకు వచ్చి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని ఇన్స్పెక్టర్ కృష్ణ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here