- కోమా పేషెంట్‌ను భారత్‌కు తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభం
- పెషేంట్ హైదరాబాద్ కు చేరుకోగానే ‘నిమ్స్’ లో వైద్యం అందించనున్నట్లు డా. జి. చిన్నారెడ్డి హామీ
బలగం టీవీ, జగిత్యాల:
జగిత్యాల జిల్లా, జగిత్యాల రూరల్ మండలం పొలాసకు చెందిన ప్రవాసీ కార్మికుడు ఆరెల్లి గంగరాజం (64) దుబాయిలో అకస్మాత్తుగా గుండె సంబంధిత సమస్యతో అపస్మారక స్థితిలోకి జారిపోయారు. నవంబర్ 12 నుండి దుబాయి అల్-గెసిస్ లోని ఆస్టర్ హాస్పిటల్‌లో కోమాలో చికిత్స పొందుతున్నారు.
గంగరాజం భార్య రాజవ్వ ప్రభుత్వ సహాయం కోరుతూ, తేది: 09.12.2025, మంగళవారం నాడు హైదరాబాద్ బేగంపేట ప్రజా భవన్‌లో నిర్వహించిన ‘సీఎం ప్రవాసీ ప్రజావాణి’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి పేరిట దరఖాస్తు సమర్పించారు. తన భర్తను దుబాయి నుంచి భారత్ కు తరలించి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. వెంటనే స్పందించిన రాష్ట్ర ప్రభుత్వ జిఏడి ఎన్నారై విభాగం, దుబాయిలోని ఇండియన్ కాన్సులేట్ తో సంప్రదింపులు ప్రారంభించింది.
ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ నియమిత ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి మార్గనిర్దేశం చేశారు. పేషెంట్ కుటుంబ సభ్యులను సీఎం ప్రజావాణి ఇంచార్జి, తెలంగాణ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ డా. జి. చిన్నారెడ్డి వద్దకు తీసికెళ్లారు. పేషంట్ దుబాయి నుండి హైదరాబాద్‌కు చేరుకున్న వెంటనే నిమ్స్ హాస్పిటల్‌లో అత్యవసర వైద్యం అందించేందుకు జి. చిన్నారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. పేషెంట్ కుమారుడు జలంధర్, ప్రస్తుతం దుబాయిలోనే ఉండి చికిత్సను పర్యవేక్షిస్తున్నారు. దుబాయి లోని తెలంగాణ సామాజిక సేవకులు రవి డేవిడ్, భారత దౌత్య కార్యాలయం, కంపెనీ యాజమాన్యం, ఆస్పత్రితో సమన్వయం చేస్తున్నారు.

