బలగం టీవీ, వేములవాడ:
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడను సందర్శించారు. ఈ సందర్భంగా వేములవాడ పట్టణంలోని శ్రీ భీమేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మంత్రి సీతక్క ఆలయానికి చేరుకోగానే ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆమెకు పుష్పగుచ్ఛం అందజేసి సాదరంగా ఆహ్వానించారు. ఆలయ అర్చకులు, అధికారులు మంత్రికి పూర్ణకుంభంతో మంగళవాయిద్యాల నడుమ ఘన స్వాగతం పలికారు. దర్శనంలో భాగంగా మంత్రి సీతక్క ముందుగా ఆలయ సంప్రదాయం ప్రకారం కోడె మొక్కు చెల్లించుకున్నారు. శ్రీ భీమేశ్వర స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని గాయత్రి మాతను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ అర్చకులు మంత్రికి వేదోక్త ఆశీర్వచనం అందజేశారు. ఆలయ అధికారులు స్వామి వారి తీర్థ ప్రసాదాలను, శేష వస్త్రాన్ని మంత్రికి బహూకరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.






