బలగం టీవీ, హైదరాబాద్:
మంథని డివిజన్ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన డివిజన్ మీడియా ప్రెస్ క్లబ్‌ను ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంథని ఫ్రెండ్స్ క్లబ్ ఆవరణలో ఫార్చ్యూన్ మెడికేర్ హాస్పిటల్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన మెగా ఉచిత వైద్య శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. డివిజన్ ప్రెస్ క్లబ్ సభ్యులకు ఇళ్ల స్థలాలతో పాటు ప్రభుత్వ పథకాలు అందేలా తన వంతు ప్రయత్నం చేస్తానని ఆయన తెలిపారు.
డివిజన్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మోత్కూరు శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈ క్లబ్ ఎవరికీ పోటీ కాదని, వార్తలు సేకరించడంలో మాత్రమే పోటీ ఉంటుందని స్పష్టం చేశారు. ఈ క్లబ్ ఏ పార్టీకి అనుబంధంగా ఉండదని, అన్ని పార్టీలతో సమతూకంగా పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేయడమే ఈ క్లబ్ ఉద్దేశమని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో మీడియా సభ్యులతో పాటు పలువురు రాజకీయ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
