బలగం టివి , ,సిరిసిల్ల
పవర్ లూమ్ క్లాత్ ఫోల్డింగ్ మెషీన్ తయారు చేసిన సిరిసిల్ల ప్రభుత్వ స్కూల్ విద్యార్ధి
ఐడీఓసీ ఆవరణలో పరిశీలించిన కలెక్టర్
ఎగ్జిబిట్ ను టీ వర్క్స్ కు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలన
పవర్ లూమ్ లఫై ఉత్పత్తి అయ్యే క్లాత్ ఫోల్డింగ్ లో తల్లిదండ్రులు జ్ఞానేశ్వర్, రూప ఇబ్బందులు చూడలేక పవర్ లూమ్ క్లాత్ ఫోల్డింగ్ మెషీన్ తయారు చేశాడు సిరిసిల్ల శివ నగర్ లోని కుసుమ రామయ్య బాలుర స్కూల్ పదో తరగతి విద్యార్ధి జక్కని హేమంత్. సిరిసిల్ల పట్టణం గణేష్ నగర్ కు చెందిన జక్కని జ్ఞానేశ్వర్, రూప కొడుకు హేమంత్ పదో తరగతి చదువుతున్నాడు. నిత్యం తన ఇంట్లో పవర్ లూమ్ లఫై ఉత్పత్తి అయిన బట్టలను మడత పెట్టేందుకు తన తల్లిదండ్రులు, సమీపంలోని కార్మికులు ఇబ్బంది పడుతున్నది చూసాడు. గంటల తరబడి బట్టను మడత పెడుతూ కాళ్లు, నడుము నొప్పులతో బాధపడే వారిని చూసి
కన్నీటి పర్యంతమయ్యాడు. వారి కష్టాలను ఎలాగైనా దూరం చేయాలని ఎన్నో రోజులు ఆలోచించాడు. దీనిఫై తన స్కూల్ లోని ఉపాధ్యాయులతో మాట్లాడాడు. వారి సలహాలు, సూచనల మేరకు దాదాపు రెండు నెలల పాటు కష్టపడి రూ. రెండు వేలతో పవర్ లూమ్ క్లాత్ ఫోల్డింగ్ మెషీన్ ను చక్రాలు, చైన్స్, మోటార్, సెన్సార్ ను ఉపయోగించి తయారు చేశాడు. బట్టలు మడత పెట్టేందుకు గంట సమయం పడుతుండగా, ఈ యంత్రం సాయంతో కేవలం 10 నిమిషాల వ్యవధిలో పూర్తి చేయవచ్చని హేమంత్ చెప్పాడు.

హేమంత్ కు కలెక్టర్ అభినందన
10వ తరగతి విద్యార్థి జక్కని హేమంత్ నేత కార్మికులకు ఉపయోగపడే పవర్ లూమ్ క్లాత్ ఫోల్డింగ్ మిషన్ ను తయారు చేసినందుకు కలెక్టర్ అనురాగ్ జయంతి అభినందించారు. విద్యార్థి ఎగ్జిబిట్ విషయాన్ని కలెక్టర్ దృష్టికి డిపీఆర్ఓ దశరథం ఆదివారం తీసుకెళ్లారు. దీంతో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ఆవరణలో హేమంత్ ఎగ్జిబిట్ ను ఏర్పాటు చేయగా, కలెక్టర్ పరిశీలించారు. దాని వినియోగం గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ఈ ఎగ్జిబిట్ ని టీ వర్క్స్ హైదరాబాద్ కి పంపించి పేటెంట్ కోసం ప్రయత్నం చేద్దామని కలెక్టర్ పేర్కొన్నారు. తయారు చేసేందుకు కారణాలు పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుల సహాయ సహకారాల గురించి తెలుసుకొని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను తీర్చిదిద్దిన ఉపాధ్యాయులను ప్రత్యేకంగా అభినందించారు. నిరుపేద కుటుంబంలో ఉన్న హేమంత్ ఆర్థిక పరిస్థితిని తెలుసుకొని, వారి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. హేమంత్ నాన్న జ్ఞానేశ్వర్ కరోనాకాలంలో చనిపోయారు. అతడికి భార్య రూప, పూనం, హేమంత్, కీర్తి ఉన్నారు. నేత కార్మికురాలిగా పనిచేస్తూ పిల్లలను చదివించడం చాలా ఇబ్బందిగా ఉందని హేమంత్ తల్లి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా, విద్యార్థుల చదువుల బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. హేమంత్, ఎగ్జిబిట్, గైడ్ టీచర్ పాకాల శంకర్ గౌడ్ ను టీ వర్క్స్ తీసుకెళ్లడానికి ఏర్పాట్లు చేయాలని జిల్లా విద్యాధికారి రమేష్ ను ఆదేశించారు. తన కుమారుడు హేమంత్ తయారు చేసిన ఎగ్జిబిట్ ను చూసి స్పందించి కుటుంబానికి అండగా ఉంటామని తెలియజేసిన కలెక్టర్ కు రూప, వారి కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ అదనపు కలెక్టర్ పూజారి గౌతమి, టెక్స్టైల్ ఏడీ సాగర్, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, ప్రధానోపాధ్యాయుడు మోతిలాల్, సైన్స్ ఉపాధ్యాయులు సరిత, శ్రీహరి, రజిత, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.