బలగం టీవీ, హైదరాబాద్:
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు పుట్టినరోజు సందర్భంగా బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. గాంధీజీ చూపిన అహింసా మార్గంలో 14 ఏళ్ల పాటు మహోద్యమాన్ని నడిపి దేశంలోని అన్ని పార్టీలను మెప్పించి,ఒప్పించి చావు నోట్లో తలపెట్టి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన మహానేత కేసీఆర్ అని ఎంపీ రవిచంద్ర కొనియాడారు.ప్రజల చిరకాల కోరికను నెరవేర్చడమే కాక తొలి ముఖ్యమంత్రిగా సుపరిపాలన అందించి తెలంగాణను అన్ని రంగాలలో అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దిన దార్శనికులు కేసీఆర్ అని ఎంపీ రవిచంద్ర తన ప్రకటనలో పేర్కొన్నారు. మిషన్ కాకతీయ పథకాన్ని చేపట్టి చెరువులు,కుంటలను పునరుద్ధరించి భూగర్భ జలాల మట్టాలను పెంచారని, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మింపజేసి తెలంగాణను ఆకుపచ్చగా, సస్యశ్యామలంగా తీర్చిదిద్దిన మహానేత కేసీఆర్ అని ఎంపీ రవిచంద్ర శ్లాఘించారు. మిషన్ భగీరథ ద్వారా ప్రజలందరికి పరిశుభ్రమైన తాగునీరందించారని, రైతుబంధు,రైతుబీమా పథకాలను కేసీఆర్ రూపొందించి విజయవంతంగా అమలు చేసి ఐక్యరాజ్యసమితి (యుఏన్వో),ఎంఎస్ స్వామినాథన్ వంటి సుప్రసిద్ధ శాస్త్రవేత్తల ప్రశంసలు అందుకున్న విషయాన్ని ఎంపీ రవిచంద్ర గుర్తు చేశారు.
దళితబంధు ప్రవేశపెట్టి ఏస్సీల జీవితాలలో వెలుగులు నింపారని,ఏస్టీల రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచిన బహుజనుల పక్షపాతి కేసీఆర్ అని ఎంపీ వద్దిరాజు ప్రస్తుతించారు.దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించిన మహనీయులు భారతరత్న డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని నెలకొల్పడమే కాక, అధునాతనంగా నిర్మించిన సచివాలయానికి ఆయన పేరు పెట్టి గౌరవించారని ఎంపీ వద్దిరాజు చెప్పారు.
అన్ని వర్గాల వారికి కార్పోరేట్ స్థాయిలో ఉన్నత ప్రమాణాలు కలిగిన విద్యనందించేందుకు పెద్ద సంఖ్యలో గురుకులాలు నెలకొల్పిన వైతాళికులు చంద్రశేఖర రావు అని ఎంపీ రవిచంద్ర వివరించారు.కేసీఆర్ మార్గదర్శనంలో కేటీఆర్ ఐటీ,ఫార్మా రంగాలతో పాటు హైదరాబాద్ నగరాన్ని ప్రగతిపథాన పరుగులు పెట్టించారని, హరీష్ రావు వైద్యాన్ని అన్ని వర్గాల ప్రజలకు మరింత చేరువ చేశారని ఎంపీ రవిచంద్ర చెప్పారు.తెలంగాణ ఏర్పాటుకు ముందు హైదరాబాద్ నుంచి ఐటీ రంగం ఎగుమతులు కేవలం 57 వేల కోట్ల రూపాయలు మాత్రమే గాక,2023-24 నాటికి 2లక్షల72వేల76 కోట్లకు 299% శాతం పెరగడం కేసీఆర్ పాలనాదక్షతకు ప్రబల నిదర్శనమని ఎంపీ వద్దిరాజు తెలిపారు.ఫార్మా ఉత్పత్తుల ఎగుమతులు 2019-20లో 34,800 కోట్ల రూపాయలు కాగా,2023-24 నాటికి 36,893 కోట్ల రూపాయలకు చేరుకున్నాయని చెప్పారు.తలసరి ఆదాయం 2014-15లో 1,24,104 రూపాయలు కాగా,2024-25 నాటికి 3,87,000 రూపాయలకు చేరుకోవడం కేసీఆర్ ఘనతే అని ఎంపీ రవిచంద్ర వివరించారు. మహనీయులు భారతరత్న డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ చూపిన రాజ్యాంగ స్ఫూర్తితో రాష్ట్రాన్ని సాధించడమే కాక పదేళ్లు సుపరిపాలన అందించి అన్ని రంగాలలో బంగారుమయంగా తీర్చిదిద్దిన కేసీఆర్ తెలంగాణ జాతిపిత అని ఎంపీ రవిచంద్ర కీర్తించారు.
మహనీయులు కేసీఆర్ ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకుంటూ నిండూ నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఎంపీ వద్దిరాజు ఆకాంక్షించారు.
