మన దేశంలో ఎక్కువ సైబర్ నేరాలు గుజరాత్, మహారాష్ట్ర నుంచి జరుగుతున్నాయి. కంప్యూటర్, ఇంటర్నెట్ టెక్నాలజీని బాగా నేర్చుకున్న నిపుణులే ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నారు. ఈ హ్యాకర్లు ఏ పనీ చెయ్యరు. డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేస్తారు. జల్సాలు చేస్తారు. ప్రపంచ దేశాలు చుట్టేస్తారు. డబ్బు కావాల్సి వచ్చినప్పుడు మాత్రం కంప్యూటర్ ముందు కూర్చుంటారు. ఎవర్ని ముంచాలి అని ఆలోచించి.. గురిపెట్టి.. మనీ కొల్లగొడతారు. ముంబైలో హ్యాకర్లు అదే చేశారు.
ముంబైలోని కఫ్ పరేడ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ నేరం జరిగింది. అక్కడ 70 ఏళ్లు దాటిన దంపతులు నివసిస్తున్నారు. బాధితురాలి భర్త ఇదివరకు ఓ ఐటీ, కన్సల్టింగ్ కంపెనీలో ఉద్యోగం చేసి రిటైరయ్యారు. బాధితురాలికి మేలో ఓ మహిళ కాల్ చేసింది. “నేను ఎంప్లాయీస్ ఫ్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) నుంచి కాల్ చేస్తున్నాను” అని చెప్పింది. “కన్ఫర్మేషన్ కోసం మీ భర్త వివరాలు చెబుతున్నాను” అంటూ పూర్తి వివరాలు చెప్పింది. దాంతో ముసలామె ఆమెను నమ్మేసింది.
“మీ భర్త PF అకౌంట్‌లో 20 ఏళ్ల కిందట రూ.4 లక్షలు డిపాజిట్ అయ్యాయి. అవి ఇప్పుడు విత్ డ్రా చేసుకోవచ్చు. తద్వారా మీకు రూ.11 కోట్లు వస్తాయి. ఐతే, మీరు TDS, GST, ఇన్‌కంటాక్స్ చెల్లించాల్సి ఉంటుంది” అని చెప్పింది.
ఆ దంపతులు ఇదంతా నిజమే అనుకున్నారు. ఆమె చెప్పిన అకౌంట్‌లో రూ.4.35 కోట్లను విడతల వారీగా సెప్టెంబర్ వరకూ చెల్లించారు. అవతలి అమ్మాయి మరింత మనీ కావాలని అడిగింది. వారు ఇవ్వలేమని చెప్పారు. దాంతో ఆ మహిళ రివర్స్ అయ్యింది. మీరు ఇన్‌కం టాక్స్ కట్టకుండా నాటకాలాడుతున్నారు. మీ సంగతి ఐటీ వాళ్లకు చెబుతా అని వార్నింగ్ ఇచ్చింది. ఆ తర్వాత ఫోన్ కాల్ కట్ అయ్యింది. మళ్లీ కాల్ రాలేదు.
తాము మోసపోయామని గ్రహించిన ఆ దంపతులు.. పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. సాధారణంగా ఇలాంటి సైబర్ క్రైమ్ నేరస్థులను పట్టుకోవడం పోలీసుల వల్ల కూడా కావట్లేదు. నేరస్థులు.. నేరం జరిగిన తర్వాత.. ఆధారాలన్నీ మాయం చేస్తున్నారు. అసలు వారు ఎక్కడి నుంచి ఇలా చేస్తున్నారో కూడా తెలియట్లేదు. డబ్బు డిపాజిట్ చేసిన బ్యాంక్ అకౌంట్ కూడా క్లోజ్ అవుతోంది. అ అకౌంట్‌కి ఇచ్చిన డాక్యుమెంట్లన్నీ డూప్లికేట్‌వే ఉంటున్నాయి. అందువల్ల ఇలాంటి నేరస్థుల విషయంలో ప్రజలు చాలా జాగ్రత్త పడాల్సి ఉంటుంది.