– పోలింగ్ కేంద్రాలను పరిశీలించాలి..
– ప్రిసైడింగ్ ఆఫీసర్లకు శిక్షణ.
- ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్
బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలని ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ ఆదేశించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రిసైడింగ్ ఆఫీసర్లకు ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్, ముస్తాబాద్ లోని రైతు వేదికలో శుక్రవారం ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హాజరై ఎన్నికల నిర్వహణ, వివిధ అంశాలపై శిక్షణ ఇచ్చారు. పీపీటీ ప్రదర్శన ఇచ్చి ప్రతి అంశంపై వివరించారు.
ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. ఎస్ఈసీ ఆదేశాల ప్రకారం విధులు నిర్వర్తించాలని సూచించారు. పోలింగ్ కేంద్రంలో విద్యుత్ సరఫరా, నీటి వసతి తదితర సదుపాయాలు తనిఖీ చేయాలని, సంబంధిత ఎంపీడీఓలు, అధికారులతో ఆ సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు, ఇంక ఇతర సామగ్రి సరిచూసుకోవాలని సూచించారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి పోలింగ్ కేంద్రాలకు కేటాయించిన వాహనాల్లోనే ఎన్నికల సామగ్రి తరలించాలని స్పష్టం చేశారు. అనంతరం లేవనెత్తిన సందేహాలను నివృత్తి చేశారు.
నామినేషన్ కేంద్రంలో పరిశీలన
ముస్తాబాద్ లోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ పరిశీలించారు. హెల్ప్ డెస్క్, నామినేషన్లు పరిశీలించి, అధికారులతో మాట్లాడారు. శిక్షణలో మండల ప్రత్యేక అధికారులు అఫ్జల్ బేగం, రాఘవేందర్, క్రాంతి, తహసీల్దార్లు సుజాత, రామచందర్, ఎంపీడీఓలు సత్తయ్య, లచ్చాలు, ట్రైనర్లు తదితరులు పాల్గొన్నారు.
