- ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్
బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
రాష్ట్ర ఎన్నికల సంఘం నియమావళికి అనుగుణంగా అధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తించాలని ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ సూచించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గీతానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జోనల్ ఆఫీసర్స్, ఆర్ఓలు, ఏఆర్ఓలు, పీఓలు, ఏపీఓలకు శిక్షణ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించగా, ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ హాజరయ్యారు.
ఈ సందర్బంగా ఇంచార్జి గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. ఎన్నికల విధులను నిష్పక్షపాతంగా, నిజాయితీగా ఎంతో జాగరూకతతో నిర్వర్తించాలని ఆదేశించారు. నియమ, నిబంధనల స్పష్టమైన అవగాహన ఉండాలని, ఎస్ ఈ సీ హ్యాండ్ బుక్ వెంట ఉండాలని సూచించారు. ఎస్ ఈసీ మార్గదర్శకాల మేరకు సజావుగా ఎన్నికలు జరిగేలా కృషి చేయాలని అన్నారు.
సిరిసిల్లలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రం గీతానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేస్తామని ఎన్నికల అధికారులు, సిబ్బంది ఎన్నికల సామగ్రితో వారికి కేటాయించిన వాహనాల్లోనే వెళ్లాలని,పోలింగ్ కేంద్రంలో ఎన్నికల రోజున అన్ని ఏర్పాట్లను సరి చూసుకోవాలని అన్నారు. ఓటర్లు 18 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి తీసుకువెళ్ళి ఓటు హక్కు వినియోగించుకోవచ్చని అన్నారు. పోలింగ్ కేంద్రంలోకి మొబైల్ ఫోన్ అనుమతి లేదని స్పష్టం చేశారు. బ్యాలెట్ పేపర్ అకౌంట్, బ్యాలెట్ బాక్స్ లు చెక్ చేసుకొని తీసుకువెళ్లాలని ఆదేశించారు.
గుర్తింపు కార్డు ఉన్న పోలింగ్ ఏజెంట్స్, ఎన్నికల అధికారులు మినహా ఎవరికీ అనుమతి లేదని అన్నారు.పోలింగ్ ముగిసిన తర్వాత సామగ్రి అంతా సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సినారే కళామందిర్ లో ఏర్పాటు చేసిన రిసెప్షన్ కేంద్రానికి తరలించి అప్పగించాలని అన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలని పిలుపు నిచ్చారు.
ఈ నెల 7, 8 తేదీల్లో సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ కార్యాలయాల్లో ఫెసిలిటేషన్ కేంద్రాలు అందుబాటులో ఉంటాయని అన్నారు.పోలింగ్ కేంద్రాల్లో అధికారులు, సిబ్బందికి కనీస వసతులు, భోజనం ఇతర సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు.
ఈ శిక్షణ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, ఆర్డీఓ వెంకటేశ్వర్లు, ట్రైనింగ్ నోడల్ అధికారి శ్రీనివాసాచారి, జిల్లా విద్యాధికారి జగన్ మోహన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, తహసీల్దార్ మహేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
