బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
- క్వింటాల్ శనగలకు 5650 రూపాయల మద్దతు ధర
- శనగలు కొనుగోలు కేంద్రాల ఏర్పాటు పై అధికారులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్
జిల్లాలో రైతులు పండించిన శనగల పంటను పూర్తిస్థాయిలో మద్దతు జరుపు కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో శనగలు కొనుగోలు కేంద్రాల ఏర్పాటు పై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ సిరిసిల్ల జిల్లాలో మొత్తం 175 ఎకరాలలో శనగల సాగు జరిగిందని, మొత్తం 1347 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అన్నారు. బోయినపల్లి,చందుర్తి,కొనరావు పేట్, రుద్రంగి మండలాల్లో ప్యాక్స్,డిసిఎం కేంద్రాల ద్వారా శనగలు కొనుగోలు చేయడం జరుగుతుందని అన్నారు.
శనగలు కొనుగోలు కేంద్రంలో అవసరమైన తేమ యంత్రాలు, టార్ఫాలిన్ కవర్లు, వెయింగ్ యంత్రాలు, గన్ని బ్యాగులు ఇతర సామాగ్రి అందుబాటులో పెట్టుకోవాలని అన్నారు. కొనుగోలు కేంద్రాల నుంచి శనగల తరలింపు కోసం వాహనాలను సన్నద్దం చేయాలని అన్నారు. శనగలు కొనుగోలు కేంద్రాల పై విస్తృత ప్రచారం కల్పించాలని, రైతులకు క్వింటాల్ ప్రభుత్వం 5650 చెల్లించి మద్దతు ధరతో కొనుగోలు చేస్తుందని అవగాహన కల్పించాలని, తక్కువ ధరకు అమ్ముకోకుండా చూసుకోవాలని అన్నారు.
కొనుగోలు కేంద్రాల సమీపంలో శనగలు భద్రపరిచేందుకు అవసరమైన గో డౌన్లను గుర్తించాలని అన్నారు. వ్యవసాయ మార్కెట్ యార్డులు, ఎఫ్.సి.ఐ, ప్రైవేట్ గోదాముల పరిశీలించి భద్రపరిచేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు.
శనగల కొనుగోలుకు సంబంధించి కనీసం మద్దతు ధర, పంట నాణ్యత పరిశీలన , తేమ శాతం , ఇతర నాణ్యత ప్రమాణాలపై అధికారులకు అవసరమైన శిక్షణ కార్యక్రమం సిబ్బందికి అందించాలని, జిల్లాలో శనగల కొనుగోలు కేంద్రం త్వరితగతిన ఏర్పాటు చేసి రైతుల నుంచి కొనుగోలు ప్రారంభించాలని కలెక్టర్ ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల వద్ద అవసరమైన హమాలీలు అందుబాటులో ఉండేలా చూడాలని కలెక్టర్ తెలిపారు.

ఈ సమావేశంలో జిల్లా మార్కెఫెడ్ అధికారి హాబీబ్, జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రకాష్, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జలిబేగం,డి సి ఓ రామకృష్ణ , డిఎం సివిల్ సప్లై రజిత డిసిఎస్ఓ వసంత లక్ష్మి సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.