ఓయూ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఖాసీంపై నమోదైన రెండు క్రిమినల్ కేసులు కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు..
బలగం టీవీ, హైదరాబాద్:
ఓయూ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఖాసీంపై నమోదైన రెండు క్రిమినల్ కేసులను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఓస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో ధర్నా నిర్వహించారని ఆరోపిస్తూ పోలీసులు కేసులు నమోదు చేశారు.
ఈ కేసులను రద్దు చేయాలని కోరుతూ ప్రొఫెసర్ ఖాసీం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం, నమోదు చేసిన కేసుల్లో సరైన ఆధారాలు లేవని కోర్టు అభిప్రాయపడింది.
ధర్నా నిర్వహణకు సంబంధించిన అంశంలో నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు స్పష్టమైన సాక్ష్యాలు లేవని పేర్కొంటూ, ప్రొఫెసర్ ఖాసీంపై నమోదైన రెండు క్రిమినల్ కేసులను కొట్టివేస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది. ఈ తీర్పుతో ప్రొఫెసర్ ఖాసీంకు ఊరట లభించింది.
