ప్రజా సంక్షేమమే ధ్యేయం, ఇందిరమ్మ ఇళ్లతో నిరుపేదల కల సాకారం, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్…

0
23

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:

రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, ప్రతి అర్హుడికి గృహ సౌకర్యం కల్పించడమే ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లింగంపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలుపుతూ, ఇల్లు లేని ప్రతి కుటుంబానికి ఆత్మగౌరవంతో కూడిన నివాసం కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిస్తోందని ఆయన స్పష్టం చేశారు.

అనంతరం నియోజకవర్గ అభివృద్ధిపై మాట్లాడుతూ, వేములవాడ–కోరుట్ల మధ్య నిర్మిస్తున్న 100 ఫీట్ల ఫోర్ లైన్ రహదారి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే రూపుదిద్దుకుంటోందని తెలిపారు. ఈ రహదారి నిర్మాణానికి సుమారు రూ.160 కోట్లకు పైగా మంజూరు అయ్యాయని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో హైబ్రిడ్ అన్యుటీ మోడల్ (HAM) ద్వారా ఈ పనులు వేగంగా జరుగుతున్నాయని వివరించారు. అలాగే వేములవాడ నుంచి రుద్రంగి, కథలపూర్ మీదుగా సిరికొండ వరకు, మరియు మోత్కరావుపేట నుండి చందుర్తి వరకు రూ.15 కోట్లతో రహదారి పనులను చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

అయితే, అభివృద్ధి పనులపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ఆది శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. గతంలో బీఆర్ఎస్ నాయకులు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసిన పాత వీడియోలను చూపిస్తూ, ఈ ఫోర్ లైన్ రహదారి తమ వల్లే వచ్చిందని తప్పుడు ప్రచారం చేయడం హాస్యాస్పదమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకుల నుండి రుణాలు సమీకరించి, స్వంత నిధులతో చేస్తున్న పనులను కేంద్రం ఖాతాలో వేయడం ప్రజలను తప్పుదారి పట్టించడమేనని మండిపడ్డారు. కేంద్రం నుండి కొత్తగా రహదారులు తీసుకువస్తే తమకు అభ్యంతరం లేదని, కానీ చేస్తున్న అభివృద్ధిని వక్రీకరించడం మానుకోవాలని ఆయన హితవు పలికారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here