బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
సైబరాబాద్ కమిషనరేట్ వేదికగా ఫిబ్రవరి 16 నుండి 21 వరకు జరిగిన 4వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు అద్భుత ప్రతిభ కనబరిచారు. మొత్తం 08 పతకాలను (04 స్వర్ణ, 04 కాంస్య) కైవసం చేసుకుని జిల్లా పోలీస్ శాఖ గర్వపడేలా చేశారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో విజేతలను జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ప్రత్యేకంగా అభినందించి, పతకాలను అందజేశారు.
ఈ క్రీడల పోటీల్లో జిల్లాకు చెందిన పలువురు అధికారులు మరియు సిబ్బంది అద్భుత ప్రదర్శన ఇచ్చారు. ఆర్ముడ్ రిజర్వ్ కానిస్టేబుల్ సతీష్ 500 మీటర్స్ సింగిల్, 500 మీటర్స్ డబుల్స్ మరియు 200 మీటర్స్ సింగిల్ విభాగాల్లో ఏకంగా మూడు బంగారు పతకాలను సాధించారు. అదేవిధంగా, కానిస్టేబుల్ గంగరాజు 500 మీటర్స్ సింగిల్ మరియు డబుల్స్ విభాగాల్లో ఒక బంగారు పతకాన్ని సాధించి జిల్లా ప్రతిభను చాటారు. జిల్లా ఆర్ముడ్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ మధుకర్ ఈ విభాగంలో కాంస్య పతకాన్ని సాధించారు. మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో డీటీసీ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఏ.ఆర్.ఎస్.ఐ లు సత్యనారాయణ మరియు ఆనంద్ లు తమ విభాగంలో కాంస్య పతకాలను సాధించారు.
విజేతలను అభినందించిన అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. క్రీడలు పోలీసుల మానసిక దృఢత్వాన్ని పెంపొందించడంలో మరియు పని ఒత్తిడిని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. గెలుపోటములు సహజమని, విజేతలు జాతీయ స్థాయిలో మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. అలాగే పోటీల్లో పాల్గొని ఓటమి చెందిన వారు నిరాశ చెందకుండా, తమ లోపాలను సరిదిద్దుకొని భవిష్యత్తులో మెరుగైన ప్రదర్శన ఇవ్వాలని సూచించారు.
