బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
సిరిసిల్ల పట్టణం 23వ వార్డుకు చెందిన రేషన్ షాపు నంబర్ 3908001 బంద్ కావడంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. షాపు డీలర్ మే నెలలో అనారోగ్యంతో మరణించడంతో, ఆ షాపుకు ఇంచార్జిని కేటాయించకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సాధారణంగా, డీలర్ మరణించినప్పుడు, అదే పట్టణానికి చెందిన మరో రేషన్ డీలర్‌కు ఆ షాపు ఇంచార్జి బాధ్యతలు అప్పగించాలి. కానీ, ఈ విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహించారని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేస్తున్న తరుణంలో, ఈ షాపు బంద్‌కావడం వార్డు ప్రజలకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తోంది. బియ్యం కోసం ఇతర వార్డుల్లోని దుకాణాలకు వెళ్లాల్సి వస్తుండటంతో వృద్ధులు, దివ్యాంగులు మరింత ఇబ్బంది పడుతున్నారు.
ఈ వ్యవహారంలో రెవెన్యూ అధికారులు విఫలమయ్యారని స్పష్టమవుతోంది. ఇంచార్జిని కేటాయించకపోవడంలో రాజకీయ కోణాలు ఉన్నాయని కూడా సమాచారం. చనిపోయిన డీలర్ షాపు కోసం కొందరు రాజకీయ నాయకులు అడ్డుపుల్లలు వేస్తున్నట్లు వార్డు ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇంచార్జిని కేటాయించకపోవడంలో ఉన్న మతలబు ఏమిటని వినియోగదారులకు అర్థం కావడం లేదు.
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి పంపిణీ చేస్తున్న మూడు నెలల రేషన్ బియ్యాన్ని తీసుకోవడానికి ఇతర వార్డులలోని షాపులకు వెళ్లి, అరువు వచ్చిన వ్యక్తుల్లా నిలబడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, రేషన్ షాపుకు ఇంచార్జిని నియమించి, బియ్యం పంపిణీని సక్రమంగా జరిగేలా చూడాలని లబ్ధిదారులు కోరుతున్నారు.