మొబైల్ బాధితులకు ఊరట, 63 చోరీ ఫోన్లు రికవరీ చేసిన సిరిసిల్ల పోలీసులు…

0
66
  • రూ. 6 లక్షల విలువైన ఫోన్లను బాధితులకు అందజేసిన ఎస్పీ మహేష్ బి. గితే.
  • సెల్ ఫోన్ పోతే వెంటనే CEIR పోర్టల్‌లో ఫిర్యాదు చేయండి.
  • దొంగిలించిన ఫోన్లు కొంటే క్రిమినల్ కేసులు తప్పవు – ఎస్పీ హెచ్చరిక.

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:

మొబైల్ ఫోన్ల రికవరీలో రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ యంత్రాంగం అద్భుత ఫలితాలను సాధిస్తోంది. జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పోయిన, అలాగే చోరీకి గురైన సుమారు రూ. 6 లక్షల విలువ గల 63 మొబైల్ ఫోన్లను ఐటి కోర్ టీం రికవరీ చేసింది. ఈ ఫోన్లను జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ‘మొబైల్ రికవరీ మేళా’ ద్వారా జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఐపీఎస్ చేతుల మీదుగా బాధితులకు అందజేశారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ప్రస్తుత కాలంలో మొబైల్ ఫోన్ అనేది కేవలం పరికరం మాత్రమే కాదని, అందులో బ్యాంక్ ఖాతాలు, వ్యక్తిగత సమాచారం వంటివి నిక్షిప్తమై ఉంటాయని పేర్కొన్నారు.

మొబైల్ పోగొట్టుకున్న వెంటనే బాధితులు www.ceir.gov.in పోర్టల్‌లో ఫోన్ ఐఎంఈఐ (IMEI) నంబర్‌ను బ్లాక్ చేయాలని, తద్వారా ఫోన్ దుర్వినియోగం కాకుండా చూడవచ్చని సూచించారు. తక్కువ ధరకు వస్తున్నాయని దొంగిలించబడిన ఫోన్లు కొంటే చిక్కుల్లో పడతారని హెచ్చరించారు. సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొనేటప్పుడు తప్పనిసరిగా రసీదు తీసుకోవాలని, దొంగతనపు ఫోన్లు అని తెలిసి కొనుగోలు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.

ఆధునిక సాంకేతికతను ఉపయోగించి, పొరుగు రాష్ట్రాల నుండి సైతం ఫోన్లను వెలికితీసిన ఐటి కోర్ ఎస్.ఐ కిరణ్ కుమార్, కానిస్టేబుల్ రాజాతిరుమలేష్లను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. పోయిన ఫోన్లు మళ్ళీ దొరుకుతాయని ఊహించలేదని, తమ ఫోన్లను అప్పగించిన పోలీసులకు బాధితులు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆర్.ఐ యాదగిరి మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here