బలగం టీవీ, హైదరాబాద్:
నిజామాబాద్ జిల్లా, కమ్మర్‌పల్లి మండలం, హాస కొత్తూరు గ్రామానికి చెందిన జుంబారత్ అన్వేష్ (27) ఓమాన్ దేశంలోని బురైమిలో బలవన్మరణానికి పాల్పడటంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. ఈ దుర్ఘటనపై సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు, అన్వేష్ మృతదేహాన్ని వీలైనంత త్వరగా ఇండియాకు రప్పించాలని కోరుతున్నారు.
మృతుని సోదరుడు హరీష్ శుక్రవారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ఉన్న ప్రవాసీ ప్రజావాణిలో మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే అనిల్ ఈరవత్రి, రాష్ట్ర ఎన్నారై అడ్వైజరీ కమిటీ ఛైర్మన్ మంద భీంరెడ్డిలతో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ వినతిపత్రంలో అన్వేష్ మృతదేహాన్ని తక్షణమే స్వదేశానికి తీసుకువచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ వినతిపై ప్రజావాణి ఇంచార్జి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డా. జి. చిన్నారెడ్డి వెంటనే స్పందించారు. ఆయన వెంటనే ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రెటరీ వి. శేషాద్రితో మాట్లాడి, మస్కట్‌లోని భారత రాయబార కార్యాలయంతో సంప్రదించి అన్వేష్ మృతదేహాన్ని ఇండియాకు రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.

