– బీఆర్ఎస్ విప్ కె.పి. వివేకానంద
బలగం టీవీ, హైదరాబాద్:
మున్సిపల్ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన సమీక్ష కేవలం ఆర్భాటం తప్ప మరొకటి కాదని అసెంబ్లీ బీఆర్ఎస్ విప్ కె.పి. వివేకానంద ఎద్దేవా చేశారు. బుధవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు చేశారు.
“తనే రాజు.. తనే మంత్రి అని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి, ప్రజల అవసరాలు తీర్చడంలో రెండేళ్ల రెండు నెలల పాలనలో పూర్తిగా విఫలమయ్యారు. వీధి దీపాలు కూడా వెలిగించలేని వ్యక్తి విజన్ 2047 గురించి మాట్లాడటం హాస్యాస్పదం. రేవంత్ రెడ్డికి దావోస్ పర్యటనలపై ఉన్న శ్రద్ధ నగరంలో దోమల నిర్మూలనపై లేదు” అని వివేకానంద విమర్శించారు.
కేసీఆర్ హయాంలో హైదరాబాద్ స్థాయిని కేటీఆర్ ప్రపంచ పటంలో నిలబెట్టారని, నేడు కాంగ్రెస్ పాలనలో ఆ ప్రతిష్ట మసకబారుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం ఆమోదించిన సెకండ్ ఫేస్ మెట్రో ప్రాజెక్టును రద్దు చేసి నగర ప్రజలకు అన్యాయం చేశారు. నార్త్ హైదరాబాద్ మెట్రో డిమాండ్ పై సీఎం స్పందించడం లేదు. హైడ్రా పేరుతో హడావుడి చేసి ఇప్పుడు పార్కులకు ఫెన్సింగ్ వేయడమే గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇది ఒక పెద్ద డ్రామాగా మారింది. జీహెచ్ఎంసీని మూడు ముక్కలు చేయడం అశాస్త్రీయం. కేవలం ఆదాయంపైనే మక్కువ చూపిస్తున్న ప్రభుత్వం, మెట్రో వాటర్ బోర్డును ఎన్ని భాగాలు చేస్తుందో చెప్పాలి. “హైదరాబాద్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క ఇల్లయినా నిర్మించిందా? అని నేను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సవాల్ విసురుతున్నాను. కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్రూం ఇళ్లకు రంగులు వేసి ఇందిరమ్మ ఇళ్లుగా చూపిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు” అని వివేకానంద మండిపడ్డారు.
మున్సిపల్ ఎన్నికల కోసం రేవంత్ రెడ్డి అరాచకాలకు పాల్పడుతున్నారని, క్యాతనపల్లిలో మెజార్టీ ఉన్నప్పటికీ బాల్క సుమన్‌ను ఇబ్బందులకు గురిచేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని ఆయన అన్నారు. ప్రజల అవసరాల కంటే పన్నుల వసూళ్లపైనే సీఎంకు శ్రద్ధ ఎక్కువ అని దుయ్యబట్టారు. రానున్న రోజుల్లో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని ఆయన హెచ్చరించారు.

