రేవంత్ రెడ్డి ఒక ‘బూతుల సీఎం’.. ఆయన భాష తెలంగాణ సంస్కృతికే మచ్చ..

0
23

రేవంత్ రెడ్డి తీరు తెలంగాణ ఆత్మగౌరవంపై దాడి

రేవంత్ రెడ్డి జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు.. కానీ స్కాం క్యాలెండర్ మాత్రం ఇచ్చారు..

– మాజీ మంత్రి హరీష్ రావు

బలగం టీవీ, హైదరాబాద్:

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి వాడుతున్న భాష సభ్య సమాజం అసహ్యించుకునేలా ఉందని, చరిత్రలో ఆయనొక వికృత మనస్తత్వం కలిగిన “బూతుల సీఎం”గా మిగిలిపోతారని విమర్శించారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు.

రేవంత్ రెడ్డి వికృత భాష వల్ల తెలంగాణ ప్రతిష్ట దిగజారుతోందని హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో రాష్ట్ర మేధావులు, బుద్ధిజీవులు మౌనం వహించడం రాష్ట్రానికి ప్రమాదకరమని హెచ్చరించారు. నిరుద్యోగులకు ‘జాబ్ క్యాలెండర్’ ఇస్తానని మోసం చేసిన రేవంత్, ఇప్పుడు నెలకు ఒక స్కామ్‌తో ‘స్కాం క్యాలెండర్’ అమలు చేస్తున్నారని ఆరోపించారు. పాలనను గాలికొదిలేసి, కేవలం జేబులు నింపుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారని మండిపడ్డారు. తన కుర్చీని కాపాడుకోవడానికి రేవంత్ రెడ్డి బీజేపీతో చీకటి ఒప్పందం చేసుకున్నారని, అందుకే కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిపై కేంద్రం ఎలాంటి విచారణ జరిపించడం లేదని హరీష్ రావు ఎద్దేవా చేశారు. రుణమాఫీ, రైతుబంధు, వడ్లకు బోనస్ వంటి హామీలను ఎగ్గొట్టి రైతులను నట్టేట ముంచారని విమర్శించారు. గతంలో కేసీఆర్ హయాంలో ఉన్న 24 గంటల కరెంటును ఇప్పుడు 12 గంటలకు కుదించారని ధ్వజమెత్తారు. “తన రెండేళ్ల పాలనలో ప్రజలకు చేసింది ఏమీ లేక, తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికే రేవంత్ రెడ్డి వికృత భాషను ఆశ్రయిస్తున్నారు. తెలంగాణ జాతిపిత కేసీఆర్ ని చూసి ఓర్వలేక విషం కక్కుతున్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉపయోగిస్తున్న భాష, ప్రవర్తన తెలంగాణ ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రంగా విమర్శించారు. అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అత్యంత ఆవేదన కలిగిస్తున్నాయని, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి అదుపుతప్పి మాట్లాడటం సభ్య సమాజం ఛీకొట్టేలా ఉందని ఆయన మండిపడ్డారు. గురువారం తెలంగాణ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో హరీష్ రావు మాట్లాడారు.

“కేసీఆర్ లేని తెలంగాణ ఉందా? 4 కోట్ల ప్రజల ఆకాంక్షను నిజం చేసిన వ్యక్తి ఆయన. రైతుల కోసం రైతుబంధు, అవ్వాతాతలకు 2,000 పెన్షన్, రైతు బీమా, గురుకులాలు తెచ్చిన కేసీఆర్‌ను ప్రజలు ‘జాతిపిత’గా పిలుచుకుంటే రేవంత్ రెడ్డికి ఎందుకంత కడుపునొప్పి?” అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి కంటే పరుషంగా, బూతులతో సమాధానం చెప్పడం మాకు చేతకాక కాదు, మాకున్న సంస్కారం వల్ల మేము దిగజారి మాట్లాడటం లేదని హరీష్ రావు స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి తెలంగాణ చరిత్రలో ‘బూతుల ముఖ్యమంత్రి’గా మిగిలిపోతారని ఎద్దేవా చేశారు. తెలంగాణ మేధావులు, రిటైర్డ్ ఉద్యోగులు రేవంత్ రెడ్డి వికృత భాషను ఖండించాలని పిలుపునిచ్చారు. ఇది తెలంగాణ ఆత్మగౌరవంపై జరుగుతున్న దాడి అని, ఉద్యమ చరిత్రను చిన్నబుచ్చే ప్రయత్నమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన రెండేళ్ల పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదని, తన చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికే రేవంత్ రెడ్డి ఇలాంటి భాషను ఎంచుకున్నారని ఆరోపించారు. గురుకులాల్లో విద్యార్థుల మరణాలపై ఎందుకు స్పందించడం లేదు? 20 లక్షల మంది విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ గురించి ఎందుకు మాట్లాడటం లేదు? ఉద్యోగుల పీఆర్సీ (PRC), డీఏ (DA) బకాయిలు, నిరుద్యోగుల జాబ్ క్యాలెండర్ హామీలు ఏమయ్యాయి? ప్రజల సమస్యలను గాలికి వదిలేసి, కేవలం కేసీఆర్ త్యాగాన్ని తక్కువ చేసే ప్రయత్నమే రేవంత్ రెడ్డి పనిగా పెట్టుకున్నారని, ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావడం తెలంగాణ ప్రజల దౌర్భాగ్యమని హరీష్ రావు ధ్వజమెత్తారు.

రేవంత్ రెడ్డి జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు కానీ స్కాం క్యాలెండర్ మాత్రం ఇచ్చారు. ప్రతినెలా ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పి, నెలకు ఒక స్కామ్ చేశారు. జనవరిలో సివిల్ సప్లైస్ స్కాం, ఫిబ్రవరిలో ఎన్టీపీసీ ఫ్లై యాష్ (Fly Ash) స్కాం, మార్చిలో సాండ్ (Sand) స్కాం, ఏప్రిల్‌లో ఆర్టీసీ స్కాం,మేలో బామ్మర్దికిచ్చిన అమృత్ టెండర్ల స్కాం, జూన్‌లో ఫోర్త్ సిటీ (Fourth City) స్కాం, జూలైలో లగచర్ల, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్ స్కాం, ఆగస్టులో పీజీ మెడికల్ సీట్ల స్కాం, సెప్టెంబర్‌లో HILTP ఇండస్ట్రియల్ స్కాం, అక్టోబర్‌లో పవర్ స్కామ్, నవంబర్‌లో సింగరేణి స్కాం, డిసెంబర్‌లో ముఖ్యమంత్రి, కేఎల్ఎస్ఆర్ (KLSR) స్కామ్ లని తెలియజేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత టి. హరీశ్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కుర్చీని కాపాడుకోవడం కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. బుధవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

రేవంత్ రెడ్డి పాలనలో ప్రజా సమస్యలకు పరిష్కారం లేదని, ఆరు గ్యారెంటీలను గాలికి వదిలేశారని హరీశ్ రావు విమర్శించారు. “నెలకో కుంభకోణం చేయడం రేవంత్ ప్రభుత్వానికి అలవాటుగా మారింది. వాటి గురించి మేము ప్రశ్నిస్తే, సమాధానం చెప్పలేక తిట్ల దండకం అందుకుంటున్నారు. స్కీములు, హామీల గురించి అడిగితే ప్రజలను డైవర్షన్ చేస్తున్నారు. ఒకటి రెండు సార్లు డైవర్షన్ చేయగలవు కానీ, ప్రతిసారి చేస్తానంటే ప్రజలే నిన్ను గద్దె దించి ముఖ్యమంత్రి పదవి నుంచి డైవర్షన్ చేస్తారు, బిడ్డ జాగ్రత్త!” అని హెచ్చరించారు.

నల్గొండ మిర్యాలగూడ సభలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. 2014 నుండి 2023 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం 11.5 కి.మీ. ఎస్.ఎల్.బి.సి టన్నెల్ పనులను పూర్తి చేసింది. ఈ 14 నెలల కాలంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనీసం 100 మీటర్ల పని కూడా చేయలేదు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత చర్యల వల్ల టన్నెల్ పనులు కుప్పకూలితే, ఆ ప్రమాదంలో చిక్కుకున్న శవాలను కూడా బయటకు తీయలేని దద్దమ్మ ప్రభుత్వం మీది కాదా అని ప్రశ్నించారు. పెండ్లిపాక, దిండి రిజర్వాయర్లు మరియు టన్నెల్ పనుల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 4000 కోట్లు ఖర్చు చేసిందని గుర్తు చేశారు.

నల్గొండ జిల్లాను ఫ్లోరైడ్ రహితంగా మార్చిన ఘనత కేసీఆర్ గారిదేనని హరీశ్ రావు స్పష్టం చేశారు. వంకరబోయిన కాళ్లతో ఉన్న ఫ్లోరైడ్ బాధితులను ప్రధానమంత్రి టేబుల్ మీద పెట్టిన దుస్థితి కాంగ్రెస్ హయాంలోనే జరిగిందని, నాగార్జునసాగర్ అలైన్‌మెంట్ మార్చి నల్గొండకు అన్యాయం చేసింది కూడా కాంగ్రెస్సేనని ఎద్దేవా చేశారు.

వడ్డీ లేని రుణాల విషయంలో ముఖ్యమంత్రి పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని హరీశ్ రావు మండిపడ్డారు. “రాజన్న మీద ఒట్టేసి రుణమాఫీ చేస్తానని చెప్పి మాట తప్పావు. చొప్పదండికి వస్తావో, కొడంగల్ కు వస్తావో తేల్చుకో.. ఎక్కడ పూర్తి రుణమాఫీ జరిగిందో చూపిస్తావా? రూ. 25 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చానని చెబుతున్నావు, అది నిజమని నిరూపిస్తే నేను ప్రెస్ క్లబ్‌లో చర్చకు సిద్ధం.”

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పదవి కోసం బీజేపీతో చీకటి ఒప్పందం చేసుకున్నారని హరీశ్ రావు ఆరోపించారు. మహబూబ్ నగర్ ఎంపీ సీటును బీజేపీకి బహుమానంగా ఇచ్చింది రేవంతేనని, అందుకే కాంగ్రెస్ నేతల ఇళ్లపై ఈడీ, ఐటీ దాడులు జరిగినా ఆ వివరాలు బయటకు రావడం లేదని విమర్శించారు. అదానీకి రెడ్ కార్పెట్ పరిచి తెలంగాణ విద్యుత్ రంగాన్ని అప్పగించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

కాళేశ్వరం, మిషన్ కాకతీయ పథకాల వల్లే తెలంగాణ దేశానికి అన్నం పెట్టే ‘రైస్ బౌల్’ అయిందని ఎకనామిక్ సర్వే కూడా చెప్పిందని హరీశ్ రావు గుర్తు చేశారు. కేసీఆర్ గారి పేరు కలవరించకుండా రేవంత్ రెడ్డి ఒక్క నిమిషం కూడా మాట్లాడలేకపోతున్నారని, ఆయన వికృత చేష్టలు మార్చుకోవాలని హెచ్చారించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here