రేవంత్ రెడ్డికి ‘ఫ్యూచర్ సిటీ’పై ఉన్న ధ్యాస. పేదల ‘హెల్త్ సిటీ’పై లేదు, హరీష్ రావు ధ్వజమెత్తు…

0
28
  • వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు వెంటనే పూర్తి చేయాలి.
  • లేదంటే వరంగల్ గడ్డపైనే బీఆర్ఎస్ నిరాహార దీక్షకు దిగుతుంది.
  • నాడు ఉచిత గుండె ఆపరేషన్లు.. నేడు ఎలుకలు, పందికొక్కులకు అడ్డాగా ఎంజీఎం.
  • సాగునీటి ప్రాజెక్టులపై అసెంబ్లీలో చర్చకు మేం సిద్ధం – మైక్ కట్ చేయకుండా వస్తారా?

బలగం టీవీ, వరంగల్:

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కమీషన్లు వచ్చే రియల్ ఎస్టేట్ ‘ఫ్యూచర్ సిటీ’ మీద ఉన్న శ్రద్ధ, పేదల ప్రాణాలు కాపాడే వరంగల్ ‘హెల్త్ సిటీ’ (సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి) మీద లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీష్ రావు తీవ్రస్థాయిలో విమర్శించారు. బుధవారం వరంగల్‌లో నిర్మాణంలో ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులను పార్టీ నేతలతో కలిసి ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ, కేసీఆర్ హయాంలోనే 24 అంతస్తుల స్లాబ్ పనులు పూర్తయ్యాయని, ఈపాటికి ప్రజలకు అందుబాటులోకి రావాల్సిన ఆసుపత్రిని కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే నత్తనడకన సాగిస్తోందని మండిపడ్డారు.

జూన్ 2 నాటికి ఆసుపత్రిని పూర్తిస్థాయిలో (కేవలం ఓపీ మాత్రమే కాదు) ప్రారంభించకపోతే బీఆర్ఎస్ పక్షాన వరంగల్ లోనే నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. 2000 పడకల ఆసుపత్రికి అవసరమైన డాక్టర్లు, నర్సుల రిక్రూట్‌మెంట్‌పై ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం శోచనీయమన్నారు.

ఒకప్పుడు కేసీఆర్ పాలనలో 250 ఉచిత గుండె ఆపరేషన్లు చేసిన ఎంజీఎం ఆసుపత్రి, నేడు కాంగ్రెస్ పాలనలో ఎలుకలు, పందికొక్కులకు నిలయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం వీల్ చైర్లు, స్ట్రెచర్లు కూడా లేని పరిస్థితికి ఆసుపత్రిని దిగజార్చారని విమర్శించారు.

దేవాదుల ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం డెడ్ లైన్లు మారుస్తూ కాలయాపన చేస్తోందని హరీష్ రావు దుయ్యబట్టారు.

“దమ్ముంటే అసెంబ్లీలో మైకులు కట్ చేయకుండా, కెమెరాలు తిప్పకుండా సాగునీటి ప్రాజెక్టులపై చర్చకు రావాలి. ఎవరి హయాంలో ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్లిచ్చామో తేల్చుకుందాం.” అని ముఖ్యమంత్రికి సవాల్ విసిరారు.

జర్నలిస్టులకు ఉచిత హెల్త్ కార్డులు, అక్రిడిటేషన్ల విషయంలో ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని, వెంటనే జర్నలిస్టుల ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నాయకులపై అక్రమ అరెస్టులు మానుకొని, అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు.

పాల్గొన్న నాయకులు: ఈ పర్యటనలో మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, రవీందర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, రాజయ్య, పెద్ది సుదర్శన్ రెడ్డి మరియు ఇతర బీఆర్ఎస్ ముఖ్య నేతలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here