ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలిపిన అంబేద్కర్ డివిజన్ సంఘం నాయకులు
బలగం టీవీ, వేములవాడ:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ డివిజన్ కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ భవన నిర్మాణానికి ప్రభుత్వం భారీగా నిధులను మంజూరు చేసింది. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రత్యేక చొరవతో ఈ భవన నిర్మాణం కోసం రూ. 1 కోటి 30 లక్షలు మంజూరయ్యాయి.
ఈ నిధులు మంజూరు కావడంపై వేములవాడ డివిజన్ అంబేద్కర్ సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. శనివారం ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ను కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నాయకులు స్వీట్లు పంచుకుని, పటాకులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ.. గతంలో అంబేద్కర్ జయంతి వేడుకల సందర్భంగా భవన నిర్మాణానికి నిధులు తీసుకొస్తానని ఇచ్చిన హామీని ఎమ్మెల్యే నిలబెట్టుకున్నారని కొనియాడారు. అతి తక్కువ కాలంలోనే నిధులు మంజూరు చేయించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. అంబేద్కర్ ఆశయ సాధనకు, దళిత వర్గాల అభ్యున్నతికి ఆది శ్రీనివాస్ చేస్తున్న కృషి ఆదర్శనీయమని వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వేములవాడ డివిజన్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
