బలగం టీవీ, రుద్రంగి:
- నూతన ప్రభుత్వ కార్యాలయాల కోసం ఇంటిగ్రేటెడ్ భవనం నిర్మిస్తాము
- ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
రుద్రంగిని అన్ని మౌలిక వసతులతో కూడిన మోడల్ గ్రామంగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హామీ ఇచ్చారు. రుద్రంగి మండల కేంద్రంలో సర్వ శిక్ష అభియాన్ నిధులు రూ. 48.60 లక్షలతో నిర్మించిన మండల రిసోర్స్ సెంటర్ (ఎంఆర్సీ) భవనాన్ని శుక్రవారం ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్‌తో కలిసి ప్రారంభించారు.అనంతరం గ్రామ పంచాయతీ భవనం ఆవరణలో 21 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, రుద్రంగిలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలన్నింటిని ఒకే చోట ఏర్పాటు చేయడానికి ఇంటిగ్రేటెడ్ ప్రభుత్వ భవనాన్ని త్వరలోనే నిర్మిస్తామని, స్థానిక యువత కోరిక మేరకు క్రీడల కోసం మైదానం ఏర్పాటు చేస్తామని అన్నారు.

జిల్లాలోని యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పన లక్ష్యంగా రూ. 42 కోట్లతో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ (ATC) మంజూరైందని, టెండర్ ప్రక్రియ పూర్తైందని, త్వరలో పనులు ప్రారంభమవుతాయని,టాటా సంస్థ సహకారంతో ఈ కేంద్రంలో ఆరు రకాల కోర్సులు అందుబాటులోకి వస్తాయని అన్నారు.
మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో గోదాం నిర్మాణానికి స్థలం గుర్తించామని, పనులు త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. వేములవాడ నియోజకవర్గంలో రుద్రంగి రెండవ అతిపెద్ద గ్రామమని పేర్కొంటూ, విశాలమైన రహదారులు, మురుగు కాలువలు నిర్మిస్తున్నామని అన్నారు .
సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు నియోజకవర్గ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తున్నారని,కలికోట–సూరమ్మ ప్రాజెక్టు నిర్వాసితులకు త్వరలో పరిహారం పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ అభివృద్ధి పనుల కోసం మాత్రమే ప్రభుత్వ భూములు వినియోగిస్తామని, అర్హులైన నిరుపేదల భూములను ఎట్టి పరిస్థితుల్లో తీసుకోమని అన్నారు.ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి సాగునీటి విడుదల, 132/33 సబ్‌స్టేషన్ పనుల ప్రారంభం, విద్యుత్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికే రూ. 5 కోట్లకు పైగా నిధులతో సీసీ రోడ్లు నిర్మించామని అన్నారు. ఇందిరా చౌక్ నుంచి కుక్కుల గండి వరకు రూ. 4.57 కోట్లతో బీటీ రోడ్డు, రుద్రంగి నుంచి దసరా నాయక్ తండా వరకు రూ. 2.50 కోట్లతో హై లెవల్ బ్రిడ్జి, సీసీ రోడ్డు పనులు త్వరలో ప్రారంభమవుతాయని అన్నారు.50 ఏళ్లుగా గ్రామస్తులు ఎదురుచూస్తున్న ప్రభుత్వ ఆసుపత్రికి రూ. 1.50 కోట్లు మంజూరు చేసి 30 పడకల ఆసుపత్రి నిర్మాణం చేపట్టామని, రుద్రంగి–రామకృష్ణపూర్ పల్లె మధ్య రూ. 62 లక్షలతో కల్వర్టు నిర్మాణం పూర్తి చేశామని, అంబేద్కర్ చౌరస్తా నుంచి ఇందిరా చౌక్ వరకు రూ. 1.50 కోట్లతో రింగ్ రోడ్డు, ప్రధాన రహదారిపై రూ. 2 కోట్లతో డ్రైనేజీ నిర్మాణం, రూ. 2.50 కోట్లతో నూతన పోలీస్ స్టేషన్ నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని అన్నారు. రైతులు అంగీకరిస్తే అచ్చయ్య కుంట, నగరాం చెరువులను నీటితో నింపేందుకు నష్టపరిహారం చెల్లిస్తామని స్పష్టం చేశారు. ఎంఆర్సీ భవనం విద్యాభివృద్ధికి ఉపయోగకరమని అన్నారు.
ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. నూతనంగా ప్రారంభించిన ఎంఆర్సీ భవనం ద్వారా విద్యాభివృద్ధి సమావేశాలు, ఉపాధ్యాయ–తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ప్రభుత్వ కార్యాలయాల కోసం ఇంటిగ్రేటెడ్ భవన నిర్మాణానికి ప్రతిపాదనలు పంపిస్తామని, ప్రజలకు అవసరమైన అన్ని వసతులు కల్పిస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ నారాయణ, ఉప సర్పంచ్ మాడిశెట్టి అభిలాష్, మార్కెట్ కమిటీ చైర్మన్ చేలుకల తిరుపతి, వేములవాడ ఆర్డీఓ రాధాబాయి, డీఈఓ వినోద్ కుమార్, టీజీ ఈడబ్ల్యూఐడీసీ ఈఈ అశోక్ కుమార్, డీఈ సత్యనారాయణ, తహసిల్దార్ పుష్పలత, ఎంపీడీఓ నటరాజ్ తదితరులు పాల్గొన్నారు.






