గ్రామాల్లో, పట్టణాల్లో అనుమానితుల కదలికలపై సమాచారం అందించాలి.
కాలనీల్లో, ఇంటి పరిసరాల్లో స్వీయారక్షణార్ధం సీసీ కెమెరాల ఏర్పాటు చేసుకోవాలి.
- జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే
సంక్రాంతి పండుగ సందర్భంగా చాలా మంది సొంత ప్రాంతాలకు,బంధువుల ఇండ్లకి,విహార యాత్రలకు ప్రయాణాలు చేస్తారు.ఇదే అదనుగా దొంగలు చేతివాటం ప్రదర్శిస్తారు. ఊళ్లకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని, ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు.సంక్రాంతి పండుగ దృష్ట్యా చోరీల నియంత్రణకు అన్ని చర్యలు చేపట్టామని, ప్రజలను అప్రమత్తం చేస్తున్నామన్నారు.రాత్రి వేళల్లో వీధుల్లో గస్తీ ఏర్పాటు చేస్తున్నామన్నారు.దీనికి అనుగుణంగా జిల్లా ప్రజలు సైతం పోలీస్ వారి సలహాలు, సూచనలు పాటిస్తూ సహకరించాలని కోరారు.
ఊరికి వెళ్లాల్సి వస్తే విలువైన బంగారు, వెండి, ఆభరణాలు, డబ్బులు, బ్యాంక్ లాకర్లలో భద్రపర్చుకోండి. లేదంటే మీ ఇంట్లోనే రహస్య ప్రదేశంలో దాచుకోండి.బీరువా తాళాలను ఇంట్లో ఉంచరాదు తమతో పాటే తీసుకెళ్లాలి. సెలవుల్లో బయటికి వెళుతున్నప్పుడు మీ ఇంటికి సెంట్రల్ లాక్ సిస్టమ్ ఉండే తాళం, సెక్యూరిటీ అలారం, మోషన్ సెన్సర్ను ఏర్పాటు చేసుకోండం మంచిది. తాళం వేసి ఊరికి వెళ్లాల్సి వస్తే తప్పనిసరి స్థానిక పోలీస్టేషన్ లో లేదా మీ గ్రామ పోలీస్ అధికారికిసమాచారం ఇవ్వండి. వారి వివరాలు నమోదు చేసుకొని వారి ఇళ్లపై నిఘా ఏర్పాటు చేస్తాం. మీ వాహనాలను ఇంటి ఆవరణలోనే పార్కు చేసుకోండి. ద్విచక్ర వాహనాలకు తప్పనిసరిగా చైన్స్ తో లాక్ వెయ్యడం మంచిది. నమ్మకమైన వ్యక్తులను మాత్రమే వాచ్ మెన్/ సెక్యూరిటీ గార్డ్/ సర్వెంట్ గా నియమించుకోవాలి. సోషల్ మీడియాలో మీ లొకేషన్, ట్రావెల్స్ ప్లాన్స్, ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అనే మీ అప్డేట్స్ పెట్టకండి. మీ ఇంట్లో స్వీయ రక్షణ సీసీ కెమెరాలను అమర్చుకోవాలి.ఆన్ లైన్లో ఎప్పటికప్పుడు మొబైల్ లో మీ ఇంటిని, పరిసరాలను లైవ్/ ప్రత్యేక్షంగా చూసుకొవచ్చు. సెక్యూరిటీ సర్వేలైన్స్ కు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయి. బ్యాగుల్లో బంగారు నగలు డబ్బు పెట్టుకొని ప్రయాణం చేస్తున్నప్పుడు బ్యాగులు దగ్గరలో పెట్టుకోవాలి. బ్యాగు బస్సులో పెట్టి కిందికి దిగితే దొంగలు అపహరిస్తారు.
ఊరు వెళ్తున్నప్పుడు పక్కింటి వారికి ఇంటి పరిసరాలను గమనించాలని చెప్పాలి. ఇంటికి తాళం వేసిన తర్వాత తాళం కనబడకుండా డోర్ కట్టిన వేయాలి. ఇంట్లో ఏదో ఒక గదిలో లైట్ వేసి ఉంచాలి. ఇంట్లో లేనప్పుడు పని మనుషులు ఉంటే రోజు వాకిలి ఊడ్చమని చెప్పాలి.ఇంటి ముందు చెత్త చెదారం, న్యూస్ పేపర్స్, పాలప్యాకెట్లు జమ కానివ్వకుండా చూడండి. వాటిని కూడా గమనించి నేరస్థులు దొంగతనాలకు పాల్పడే అవకాశం ఉన్నది. మీ గ్రామం, పట్టణం, కాలనీలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే స్థానిక పోలీసు స్టేషన్ కు తప్పనిసరిగా సమాచారం ఇవ్వండి. డయల్ 100కు కాల్ చేయండి.
ప్రజలు పోలీస్ శాఖ వారి సూచనలు పాటిస్తూ సహకరిస్తే చోరీల నియంత్రించడం సులభం అవుతుందని ఎస్పీ తెలిపారు.

