సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలి..

0
105
  • ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:

పత్తి రైతులు సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. పత్తి కొనుగోళ్లు తదితర అంశాలపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సీసీఐ, మార్కెటింగ్ ఇతర శాఖల అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ జిల్లాలో సీసీఐ ఆధ్వర్యంలో ఐదు జిన్నింగ్ మిల్లుల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారని, వేములవాడ పరిధిలో రెండు, కోనరావుపేట మండలంలో ఒకటి, ఇల్లంతకుంట మండలంలో రెండు ఉన్నాయని అన్నారు. రైతులు తమ సమీపంలోని ఆయా సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో పత్తి విక్రయించి మద్దతు పొందాలని పిలుపు నిచ్చారు.పత్తి నాణ్యత ఆధారంగా క్వింటాలుకు రూ. 7689 నుంచి 8110 మద్దతు ధర ఉందని అన్నారు. కపాస్ కిసాన్లో రైతులు స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు.

సీసీఐ, మార్కెటింగ్, ఇతర శాఖల అధికారులు సమన్వయంతో రైతులకు వసతులు కల్పించాలని, సీసీఐ కొనుగోలు కేంద్రాలు, మార్కెటింగ్ కార్యాలయాలు, రైతు వేదికల్లో రైతులు స్లాట్ బుకింగ్ చేసుకునేందుకు సహాయం చేయాలని అన్నారు. ఆయా కొనుగోలు కేంద్రాల్లో 42 మంది రైతుల నుంచి 852 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేశారని అన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొనుగోళ్లు పక్కాగా చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ఏఎస్పీ చంద్రయ్య, మార్కెటింగ్ అధికారి ప్రకాష్, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, సీసీఐ సీపీఓ రఘురామ్, అగ్నిమాపక శాఖ, రవాణా శాఖ అధికారులు, పలువురు రైతులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here