మలేసియాలో జైలు పాలైన సిద్ధిపేట కార్మికుడు..

0
63
  • న్యాయ సహాయం కోసం తాజాగా ముఖ్యమంత్రికి విజ్ఞప్తి..
  • ఇదివరకే ఎంపీ రఘునందన్ రావు ద్వారా దౌత్య ప్రయత్నాలు

బలగం టీవీ, సిద్దిపేట:

ఉద్యోగం నిమిత్తం మలేసియా వెళ్లి, సహోద్యోగితో జరిగిన గొడవ కారణంగా గత 11 నెలలుగా జైలులో మగ్గుతున్న సిద్ధిపేట జిల్లాకు చెందిన మహ్మద్ అబ్దుల్ ఖాదర్ విడుదలకు న్యాయ, దౌత్య సహాయం అందించాలని ఆయన కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు.

సిద్ధిపేట జిల్లా, అక్బర్‌పేట – భూంపల్లి మండలం పోతరెడ్డిపేట గ్రామానికి చెందిన మహ్మద్ అబ్దుల్ ఖాదర్ భార్య సలీమా బేగం, కుమారుడు సల్మాన్ మంగళవారం హైదరాబాద్‌లోని బేగంపేటలో గల ‘సీఎం ప్రవాసీ ప్రజావాణి’ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరిట వినతిపత్రాన్ని సమర్పించారు. తమకు తక్షణమే న్యాయ సహాయం (లీగల్ ఎయిడ్), దౌత్య సహాయం (కాన్సులార్ హెల్ప్) అందించాలని సలీమా బేగం ముఖ్యమంత్రిని వేడుకున్నారు. తాము ఈ విషయంపై ఇదివరకే మెదక్ ఎంపీ ఎం. రఘునందన్ రావును సంప్రదించినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్ సూచనలతో ప్రవాసీ ప్రజావాణిని ఆశ్రయించినట్లు తెలిపారు. ఎన్నారై అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి వారికి ఈ సందర్భంగా మార్గదర్శనం చేశారు. 2018లో ఉద్యోగం కోసం మలేసియాకు వెళ్లిన ఖాదర్, అక్కడ సహోద్యోగితో జరిగిన గొడవ కారణంగా జైలు పాలయినట్టు కుటుంబ సభ్యులు వివరించారు. మలేసియాలోని తెలంగాణ సామాజిక సేవకుడు బూరెడ్డి మోహన్ రెడ్డి, కౌలాలంపూర్‌లోని ఇండియన్ హైకమీషన్‌తో ఈ కేసు విషయంలో సమన్వయం సాగిస్తున్నారని వారు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం ప్రతినిధి మహ్మద్ బషీర్ అహ్మద్, నేషనల్ వర్కర్ వెల్ఫేర్ ట్రస్ట్ ప్రతినిధి భార్గవి, బహరేన్ లోని తెలంగాణ సోషల్ వర్కర్ నోముల మురళి, తెలంగాణ ప్రభుత్వ జిఏడి ఎన్నారై శాఖ సెక్షన్ ఆఫీసర్ కంచర్ల శ్రీనివాస రెడ్డి, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు రాజీవ్ కుమార్, సమీనా బేగంలు ఆ కుటుంబాన్ని ఓదార్చి, ధైర్యం చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here