కువైట్‌లో మోగిన సైరన్లు.. భారీ పేలుళ్ల శబ్దాలతో ప్రజల ఆందోళన..

0
81

బలగం టీవీ, కువైట్ సిటీ:

కువైట్‌లో శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దేశవ్యాప్తంగా అత్యవసర హెచ్చరిక సైరన్లు మోగడంతో పాటు గగనతలంలో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. ఈ పరిణామం స్థానికులు మరియు ప్రవాసీయుల్లో తీవ్ర ఆందోళనకు దారితీసింది.

అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను అప్రమత్తం చేసేందుకు వినియోగించే హెచ్చరిక సైరన్లు కువైట్‌లోని పలు ప్రాంతాల్లో వినిపించాయి. సైరన్ల మోగింపుతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. పలువురు సోషల్ మీడియా వేదికగా గగనతలంలో పేలుళ్లు జరిగినట్లు భారీ శబ్దాలు వినిపించాయని పేర్కొన్నారు. అయితే ఈ పేలుళ్లకు గల ఖచ్చితమైన కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు. ఇప్పటికే ఇరాన్ గగనతలం మూసివేత, విమానాల రద్దుతో ప్రాంతీయ ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఈ సంఘటన చోటుచేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. పరిస్థితిని భద్రతా దళాలు సమీక్షిస్తున్నాయి. ప్రస్తుతం పేలుళ్లకు గల కారణాలపై అధికారిక ధృవీకరణ వెలువడాల్సి ఉంది. ప్రజలు ఎవరూ భయాందోళనలకు గురికావద్దని, కేవలం అధికారిక ప్రకటనలను మాత్రమే విశ్వసించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. పరిస్థితిని పర్యవేక్షిస్తూ అవసరమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

కువైట్ గగనతలంలో క్షిపణుల కలకలం: గాలిలోనే కూల్చివేసిన ఆర్మీ!

ప్రాంతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో కువైట్ రక్షణ వ్యవస్థ అప్రమత్తమైంది. శనివారం కువైట్ గగనతలంలోకి దూసుకొచ్చిన కొన్ని క్షిపణులను తమ వైమానిక రక్షణ వ్యవస్థలు (Air Defense Systems) విజయవంతంగా అడ్డుకుని, గాలిలోనే కూల్చివేసినట్లు కువైట్ ఆర్మీ జనరల్ స్టాఫ్ అధికారికంగా ప్రకటించింది.

దేశ రక్షణ కోసం మోహరించిన అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ సకాలంలో స్పందించి ముప్పును తప్పించాయి. ఈ ఘటన నేపథ్యంలో సరిహద్దుల వెంబడి మరియు కీలక ప్రాంతాల్లో సైన్యం నిఘాను మరింత కఠినతరం చేసింది. దేశ రక్షణ విషయంలో ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సైన్యం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని జనరల్ స్టాఫ్ భరోసా ఇచ్చింది. కువైట్ గగనతలం సురక్షితంగా ఉందని, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here