బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
గంభీరావుపేట రైతు వేదిక వద్ద నిర్వహించిన భూ భారతి చట్టం అవగాహన సదస్సులో పాల్గొన్న కలెక్టర్..
పెండింగ్ సాదా బైనామా దరఖాస్తులు నూతన ఆర్వోఆర్ చట్టం భూ భారతితో పరిష్కారం అవుతాయని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు.
గంభీరావుపేట మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద గురువారం నిర్వహించిన భూ భారతి చట్టం అవగాహన సదస్సు కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా భూ భారతి చట్టంలోని వివిధ అంశాలను కలెక్టర్ రైతులకు, ప్రజలకు వివరించారు.
అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ.. పిఓటి, ఎల్.టి.ఆర్, సీలింగ్ చట్టాల ఉల్లంఘనలు లేని దరఖాస్తులను క్రమబద్ధీకరణ చేసే నాటి స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, 100 రూపాయల అపరాధ రుసుం వసూలు చేసి సర్టిఫికెట్ జారీ చేస్తారని, హక్కుల రికార్డులు వివరాలను నమోదు చేసి పాసు బుక్ జారీ చేస్తారని వెల్లడించారు.
రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రతి గ్రామంలో గ్రామ పరిపాలన అధికారులను నియమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. మనిషికి ఆధార్ కార్డు లాగా భూమికి భూదార్ సంఖ్య కేటాయింపు ప్రణాళిక చేస్తుందని, దీని ద్వారా భూ ఆక్రమణలకు చెక్ పెట్టవచ్చని స్పష్టం చేశారు.

భూ సమస్యలపై అధికారులు అందించిన ఆర్డర్ల పై భూ భారతి చట్టం ప్రకారం ఆప్పీల్ చేసుకునే అవకాశం ఉందని, రెవెన్యూ డివిజన్ అధికారి నిర్ణయం పై కలెక్టర్ వద్ద, కలెక్టర్ నిర్ణయం పై భూమి ట్రిబ్యునల్ వద్ద అపీల్ చేసుకోవచ్చని, గతంలో ధరణి వ్యవస్థ ఉన్నప్పుడు ఏదైనా అభ్యంతరాలు ఉంటే సివిల్ కోర్టుకు మాత్రమే వెళ్లాల్సి ఉండేదని గుర్తు చేశారు.
అప్పీల్ వ్యవస్థ అందించిన తీర్పు తర్వాత కూడా సంతృప్తి చెందకపోతే సివిల్ కోర్టు వెళ్ళవచ్చని, దరఖాస్తుదారులకు అవసరమైన ఉచిత న్యాయ సలహాను ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. ప్రతి గ్రామంలో రెవెన్యూ రికార్డుల తయారు చేసి, ప్రతి సంవత్సరం గ్రామాలలో రికార్డు డిస్ ప్లే చేయడం జరుగుతుందని అన్నారు.
ఈ కార్యక్రమానికి సిరిసిల్ల ఆర్డీవో రాధాబాయి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ కొమిరిశెట్టి విజయ, తహసీల్దార్ మారుతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.