బలగం టివి, రాజన్న సిరిసిల్ల
-ప్రసూతి మరణాలు పూర్తిగా తగ్గించడంపై దృష్టి సారించాలి
కలెక్టర్ అనురాగ్ జయంతి
- వైద్య అధికారులతో సమీక్ష
మాతా శిశు సంరక్షణ పై ప్రత్యేక శ్రద్ద చూపాలని కలెక్టర్ అనురాగ్ జయంతి వైద్యాధికారుల ను ఆదేశించారు.
ప్రసూతి మరణాలు పూర్తిగా తగ్గించడంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. బుధవారం ఆయన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో వైద్యారోగ్య శాఖ అధికారులు, సంబంధిత వైద్యాధికారులతో మెటర్నల్ డెత్ పై సమీక్ష నిర్వహించి, ప్రసూతి సమయంలో గర్భిణీ స్త్రీల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించడం, గతంలో ప్రభావితం చేసిన అంశాలను అధిగమించడం, తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం కలెక్టర్ జిల్లాలో ఇది వరకు ప్రసూతి సమయంలో వివిధ ఆరోగ్య సమస్యల కారణంగా చనిపోయిన గర్భిణీలు, శిశువుల వివరాలపై ఆరా తీసి, వారు చనిపోవడానికి గల కారణాలు ఏమిటి, భవిష్యత్ లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే చేపట్టాల్సిన చర్యలు, జాగ్రత్తలపై వైద్యుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబ సభ్యుల తోనూ మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గర్భిణీ స్త్రీలకు చెకప్ లతో పాటు హైరిస్క్ కేసులను గుర్తించి వారికి మెరుగైన ట్రీట్ మెంట్ అందించాలన్నారు. రకరకాల పారామీటర్స్ లో కేసులు వస్తాయని, ఏయే కేసుకు ఎలాంటి ట్రీట్ మెంట్ చేయాలో ఒక ప్రోటోకాల్ ప్రకారం చికిత్స అందించాలని వైద్యాధికారులను కలెక్టర్ ఆదేశించారు. తద్వారా ప్రసూతి మరణాలను తగ్గించవచ్చని అన్నారు. ఆశా, ఏఎన్ఎం లు క్షేత్ర స్థాయి సిబ్బందికి అవగాహన కల్పించి, వారి పరిధిలో ఉన్న గర్భవతులకు ఎలాంటి లక్షణాలు వచ్చినా వారిని అప్రమత్తం చేసి, వారి ఆరోగ్య పరిస్థితిపై సంబంధిత మెడికల్ ఆఫీసర్ కు నివేదించేలా చూడాలని వివరించారు.
సమావేశంలో జిల్లా ఉప వైద్యాధికారులు రజిత, శ్రీ రాములు, సిరిసిల్ల జనరల్ ఆస్పత్రి పర్యవేక్షకులు సంతోష్, జిల్లా ఆసుపత్రి పర్యవేక్షకులు డా. మురళీధర్ రావు, వేములవాడ ఏరియా ఆస్పత్రి వైద్యులు మహేష్ రావు, ప్రోగ్రామ్ ఆఫీసర్లు నయీమా, ఉమ, మెడికల్ ఆఫీసర్లు, ఏఎన్ఎం లు, ఆశా సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.