బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల :
సిరిసిల్ల పట్టణ ప్రజలకు మెరుగైన పారిశుద్య వాతావరణం, తాగునీటి సరఫరా అందించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ తెలిపారు. శుక్రవారం సిరిసిల్ల పురపాలక సంఘ కార్యాలయంలో చైర్‌పర్సన్ అధ్యక్షతన సాధారణ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. మొత్తం 12 అంశాలతో నిర్వహించిన ఈ సమావేశంలో అన్ని తీర్మానాలు ఏకగ్రీవంగా ఆమోదం పొందాయి. పట్టణ అభివృద్ధి, పారిశుద్యం, నీటి సరఫరా, స్ట్రీట్‌లైట్స్ నిర్వహణ తదితర అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
సిరిసిల్ల పట్టణంలోని నెహ్రు నగర్, విద్యానగర్ తదితర ప్రాంతాల్లో గల వైకుంఠదామాల నిర్వహణలో భాగంగా రూ.101కు దహన సంస్కారాలు నిర్వహించే విధానాన్ని పునరుద్ధరించారు. ఇందుకు సంబంధించిన ఖర్చుల కోసం సంవత్సరానికి రూ.16.80 లక్షలు కేటాయిస్తూ పరిపాలనపరమైన నిధులు మంజూరు చేశారు.పట్టణ పారిశుద్యాన్ని మెరుగుపర్చేందుకు వార్డుల వారీగా ప్రత్యేక సానిటేషన్ డ్రైవ్ కార్యక్రమం చేపట్టేందుకు రూ.10 లక్షలు, రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని వివిధ వార్డుల్లోని పవర్ బోర్ల నిర్వహణకు రూ.10 లక్షలు,స్ట్రీట్ లైట్స్ నిర్వహణకు అవసరమైన సామగ్రి కొనుగోలుకు రూ.5 లక్షలు, వాహనాలైన ట్రాక్టర్లు, బ్లేడ్ ట్రాక్టర్లు, ఆటోలు, జెసిబిల మరమ్మతులకు రూ.11.20 లక్షలు కేటాయించారు.రంజాన్ పండుగ సందర్భంగా పట్టణంలోని మసీదులు, ఈద్గాల వద్ద టెంట్లు, లైటింగ్, గ్రీన్ మ్యాట్లు, త్రాగునీటి వంటి మౌలిక వసతుల కల్పనకు రూ.3 లక్షలు మంజూరు చేశారు. పట్టణ ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు చైర్‌పర్సన్ జిందం కళ తెలిపారు.
ఈ సమావేశంలో వైస్ చైర్మన్, వార్డు సభ్యులు, మున్సిపల్ కమిషనర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, టౌన్ ప్లానింగ్ అధికారులు, అసిస్టెంట్ ఇంజనీర్, అకౌంట్స్ అధికారి, రెవెన్యూ అధికారి, సానిటరీ ఇన్స్పెక్టర్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.

