బలగం టీవి, ఎల్లారెడ్డిపేట :
విద్యార్థిస్థాయినుండే శ్రమదానం, సేవాభావం, అలవర్చుకోవాలనీ, భవిష్యత్తులో ఉద్యోగులుగా, ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు నిజాయితీగా, నిస్వార్థంగా సేవలందిస్తారనీ జాతీయ సేవా పథకం వాలంటీర్లుగా విద్యార్థులు పాల్గొనడం అభినందనీయమనీ రాజన్నపేట గ్రామ సర్పంచ్ ముక్క శంకర్ అన్నారు. శనివారం రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట గ్రామంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల యెల్లారెడ్డిపేటకు చెందిన జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో ప్రత్యేక శీతాకాల శిబిరం ఏర్పాటు చేశారు.
ఈసందర్భంగా రాజన్నపేట గ్రామ సర్పంచ్ ముక్క శంకర్ మాట్లాడుతూ ఎన్.ఎస్.ఎస్ ప్రత్యేక శీతాకాల శిబిరం రాజన్నపేట గ్రామంలో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని విద్యార్థులకు చిన్న వయసులోనే సామాజిక అంశాలను పరిశీలించడం, గ్రామాల పరిస్థితులను అధ్యయనం చేయడం తెలుస్తుందనీ అన్నారు. వాలంటీర్లకు ఇబ్బందులు లేకుండా చూస్తానన్నారు.
ఇంచార్జి ప్రిన్సిపాల్ క్యాతం సత్యనారాయణ గారు మాట్లాడుతూ వారంరోజులు 19వరకు సేవాకార్యక్రమాలు నిర్వహిస్తామని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలని ఈ శిక్షణ భవిష్యత్తులో ఉపయోగపడుతుందని అన్నారు.
జాతీయ సేవా పథకం ప్రోగ్రామ్ అధికారి వాసరవేణి పర్శరాములు మాట్లాడుతూ కళాశాల నుండి గతంలో ఎన్.ఎస్.ఎస్ ద్వారా ఎల్లారెడ్డిపేట మండలంలో అనేక గ్రామాల్లో సేవలందించామనీ ప్రస్తుతం రాజన్నపేటను ఎంచుకున్నామనీ విద్యార్థులు వాలంటీర్లుగా శిక్షణపొంది సమాజసేవకులుగా మారడం, ఉత్తమ పౌరులుగా రాణించడం , దేశాభివృద్ధిలో పాలుపంచుకోవడం లక్ష్యంగా జాతీయ సేవా పథకం పనిచేస్తుందనీ అన్నారు.
మొదటిరోజులో భాగంగా గ్రామంలో పోచమ్మ ఆలయంచుట్టు పరిశుభ్రం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ముక్క శంకర్, ఇంచార్జి ప్రిన్సిపాల్ క్యాతం సత్యనారాయణ, జాతీయ సేవా పథకం ప్రోగ్రాం అధికారి వాసరవేణి పర్శరాములు, గ్రామ కార్యదర్శి రవి, లెక్షరర్ కొడిముంజ సాగర్, కారోబారి రామకృష్ణ, 50మంది ఎన్.ఎస్.ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.
