భక్తిశ్రద్ధలతో మొక్కులు తీర్చుకున్న భక్తులు.. పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
మామిడిపల్లిలో అత్యంత వైభవంగా రాములోరి జాతర..
బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
కోనరావుపేట మండలంలోని మామిడిపల్లి గ్రామంలో మాఘ అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి జాతర అత్యంత వైభవంగా జరిగింది. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి అనుబంధ ఆలయమైన ఈ క్షేత్రానికి ఉమ్మడి జిల్లా నలుమూలల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు.
ఆదివారం రోజున ఈ వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొని స్వామి వారిని దర్శించుకోని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, తీర్థప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆలయ ప్రాముఖ్యత మామిడిపల్లి సీతారామ చంద్ర స్వామి ఆలయానికి ఎంతో విశిష్టత ఉందని, భక్తుల నమ్మకాన్ని గౌరవిస్తూ ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసిందని తెలిపారు. రాజన్న ఆలయ అధికారులు, జిల్లా యంత్రాంగం సమన్వయంతో భక్తులకు శీఘ్ర దర్శనం కల్పించామని, ఎక్కడా ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు మెరుగుపరిచామని పేర్కొన్నారు. మన సనాతన ధర్మాన్ని, సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, గతంలో ఎడ్లబండ్లపై వచ్చే భక్తులు ఇప్పుడు రవాణా సౌకర్యాల పెరుగుదలతో వేలాదిగా తరలివస్తున్నారని గుర్తుచేశారు. స్వామి వారి కృపాకటాక్షాలతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఆయన భక్తులందరికీ మాఘ అమావాస్య జాతర శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఆలయ అధికారులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
