విద్యార్థిని స్కూల్‌కు పంపించట్లేదని ఇంటి ముందు ధర్నా చేసిన ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు
బలగం టీవీ, భద్రాద్రి కొత్తగూడెం:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దుమ్ముగూడెం మండలం నిమ్మలగూడెం గ్రామంలో ఒక వింత నిరసన ఘటన చోటుచేసుకుంది. పాఠశాలకు రావడం మానేసిన విద్యార్థిని మళ్లీ బడికి పంపాలని కోరుతూ ఉపాధ్యాయులు మరియు తోటి విద్యార్థులు కలిసి బాలుడి ఇంటి ముందు ధర్నాకు దిగారు.
వివరాల్లోకి వెళ్తే, నిమ్మలగూడెం గ్రామ ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న ఒక విద్యార్థి గత వారం రోజుల నుండి పాఠశాలకు హాజరు కావడం లేదు. దీనిపై ఉపాధ్యాయులు విద్యార్థి తల్లిదండ్రులను అడగ్గా, వారు సరైన సమాధానం ఇవ్వలేదు. విద్యార్థి భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని, అతన్ని తిరిగి పాఠశాలకు రప్పించాలని సంకల్పించిన ఉపాధ్యాయులు ఒక వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు. శనివారం నాడు, ఆ బాలుడి ఇంటి ముందు ఉపాధ్యాయులు మరియు తోటి విద్యార్థులు బైఠాయించి ధర్నాకు దిగారు. చదువు ప్రాముఖ్యతను తెలుపుతూ, బాలుడిని వెంటనే స్కూల్‌కు పంపాలని డిమాండ్ చేశారు.
ఉపాధ్యాయులు, తోటి విద్యార్థుల ఈ వింత మరియు ఆసక్తికర నిరసనతో స్పందించిన తల్లిదండ్రులు, ఎట్టకేలకు సోమవారం నుండి తమ కుమారుడిని తప్పకుండా పాఠశాలకు పంపుతామని హామీ ఇచ్చారు. ఈ ధర్నాతో విద్యార్థిని బడికి రప్పించే విషయంలో ఉపాధ్యాయులు విజయం సాధించారు.
