బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల :
– విద్యతో పాటు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ..
- కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
ఉత్తమ భోధన అందించడంతో పాటు, విద్యార్థుల ఆరోగ్యం పట్ల రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు.
మంగళవారం సిరిసిల్ల పట్టణంలోని మహాత్మా జ్యోతిబాపూలే బాలికల గురుకుల విద్యాలయాన్ని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సందర్శించి, దృష్టి లోపం ఉన్న విద్యార్థులకు కంటి అద్దాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ విద్యార్థులు తమకు వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకుని చదువులో ఉన్నతంగా రాణించాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యను అభ్యసిస్తున్న వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి, మౌలిక సదుపాయాలు కల్పిస్తుందని పేర్కొన్నారు. అనంతరం దృష్టి లోపం ఉన్న విద్యార్థులకు కలెక్టర్ కంటి అద్దాలను అందజేశారు.
తదనంతరం విద్యాలయంలోని తరగతి గదులను, కిచెన్, స్టోర్ రూమ్ ను కలెక్టర్ పరిశీలించారు. మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా అనే వివరాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే తనకు తెలియజేయాలని విద్యార్థులకు సూచించారు. ఇంటర్మీడియట్, పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులతో మాట్లాడి పరీక్షలు ఎలా రాస్తున్నారు అని అడిగారు. విద్యార్థులతో నిత్యం సాధన చేయించాలని ఉపాధ్యాయులను కలెక్టర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఇమ్మ్యూనైజేషన్ అధికారి డా.సంపత్, ఆర్.బి.ఎస్.కె. ప్రోగ్రామ్ ఆఫీసర్ డా.నయీం జహా, మెడికల్ ఆఫీసర్ కృష్ణవేణి, తదితరులు పాల్గొన్నారు.