- బోయినిపల్లి మోడల్ స్కూల్ లో ఆకస్మిక తనిఖీ.
- ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్
బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
బోయినిపల్లి మోడల్ స్కూల్‌ను ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మంగళవారం నాడు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులు ప్రణాళిక ప్రకారం చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని పిలుపునిచ్చారు. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కీలక సూచనలు, ఆదేశాలు ఇచ్చారు.
తనిఖీలో భాగంగా ఆమె ముందుగా పాఠశాలలోని ఉపాధ్యాయులు, సిబ్బంది హాజరును పరిశీలించారు. అనంతరం విద్యాలయం ఆవరణ పరిశుభ్రతను పరిశీలించారు. మధ్యాహ్న భోజనం మెనూ, తయారీని పరిశీలించి, మెనూ ప్రకారం ఏ ఆహార పదార్థాలను సిద్ధం చేస్తున్నారో నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం పెట్టాలని నిర్వాహకులకు సూచించారు. 7వ తరగతి గదిలో ఇంగ్లీష్ పాఠం కొనసాగుతుండగా పరిశీలించి, విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు.
ఈ సందర్బంగా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి ప్రతి రోజూ స్కూల్‌కు రావాలని సూచించారు. ఫిబ్రవరిలో సిలబస్‌ను పూర్తి చేయాలని, ఆ తరువాత వార్షిక పరీక్షలకు సాధన చేయించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. విద్యార్థులందరూ అన్ని పాఠ్యాంశాలపై పట్టు సాధించాలని, ముఖ్యంగా ఇంగ్లీష్‌లో అనర్గళంగా మాట్లాడేలా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
