సోషల్ మీడియా పోస్టులపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు!

0
68

సోషల్ మీడియా పోస్టులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు – తెలంగాణ హైకోర్టు మార్గదర్శకాలకు అత్యున్నత న్యాయస్థానం ఆమోదం.

బలగం టీవీ, హైదరాబాద్‍:

సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా పౌరులపై ఇష్టారాజ్యంగా కేసులు నమోదు చేయడం, అరెస్టులు చేయడంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రాజకీయ విమర్శలు చేయడం రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని స్పష్టం చేస్తూ, గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక మార్గదర్శకాలను సుప్రీంకోర్టు సమర్థించింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీలును కొట్టివేస్తూ, పోలీసుల పనితీరుపై అత్యున్నత న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

నాపై రాష్ట్ర ప్రభుత్వం నమోదు చేసిన కేసుల ను కొట్టివేస్తూ గత సెప్టెంబర్ లో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక మార్గదర్శకాలను సుప్రీం కోర్టు సమర్థించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ, పోలీసులకు మరియు మేజిస్ట్రేట్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు.

తీర్పులోని ముఖ్య అంశాలు..

ఎవరు పడితే వారు ఫిర్యాదు చేయలేరు: సోషల్ మీడియా పోస్ట్ వల్ల ఎవరైనా కించపరచబడ్డారని భావిస్తే, కేవలం “బాధితుడు” (Person Aggrieved) మాత్రమే ఫిర్యాదు చేయాలి. సంబంధం లేని మూడవ వ్యక్తులు ఇచ్చే ఫిర్యాదులపై పోలీసులు FIR నమోదు చేయకూడదు.

ప్రాథమిక విచారణ తప్పనిసరి: ఫిర్యాదు అందగానే నేరుగా కేసు నమోదు చేయకుండా, అందులో నిజంగా నేరపూరిత అంశాలు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి పోలీసులు ముందుగా ప్రాథమిక విచారణ జరపాలి.

రాజకీయ విమర్శలు నేరం కాదు: ప్రభుత్వం లేదా రాజకీయ నాయకులపై చేసే కఠినమైన విమర్శలు, వ్యంగ్య పోస్టులపై పోలీసులు యాంత్రికంగా కేసులు పెట్టకూడదు. రాజ్యాంగంలోని Article 19(1)(a) ప్రకారం వాక్ స్వాతంత్ర్యాన్ని కాపాడాలి.

అరెస్టులపై నియంత్రణ: సోషల్ మీడియా కేసుల్లో ఇష్టారాజ్యంగా అరెస్టులు చేయకూడదు. ‘అర్నేష్ కుమార్’ కేసు మార్గదర్శకాలను పోలీసులు కచ్చితంగా పాటించాలి.

లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి: రాజకీయంగా సున్నితమైన పోస్టులపై FIR నమోదు చేసే ముందు, పోలీసులు తప్పనిసరిగా ‘పబ్లిక్ ప్రాసిక్యూటర్’ నుండి చట్టపరమైన అభిప్రాయాన్ని తీసుకోవాలి.

తప్పుడు కేసుల క్లోజర్: రాజకీయ ప్రేరేపితమైన లేదా కక్ష సాధింపు కోసం పెట్టే తప్పుడు ఫిర్యాదులను BNSS సెక్షన్ 176(1) కింద వెంటనే క్లోజ్ చేయాలి.

ప్రజాస్వామ్యంలో విమర్శించే హక్కు అందరికీ ఉంది. కేవలం హింసను ప్రేరేపించేలా ఉంటే తప్ప, మిగిలిన ఏ సందర్భంలోనూ పోలీసులు పౌరుల గొంతు నొక్కకూడదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here