జర్నలిస్ట్ రేవతి విషయంలో పోలీసుల తీరుపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం
బలగం టీవీ, హైదరాబాద్:
సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న అరెస్టులు, విచారణల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో వరుసగా మొట్టికాయలు తగులుతున్నాయి. పల్స్ న్యూస్ జర్నలిస్ట్ రేవతి అక్రమ అరెస్ట్ మరియు ఆమెను తిరిగి పోలీస్ కస్టడీకి కోరడంపై అత్యున్నత న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
జర్నలిస్ట్ రేవతికి బెయిల్ మంజూరైన ఆరు నెలల తర్వాత, తెలంగాణ పోలీసులు ఆమెను మళ్లీ ఇబ్బంది పెట్టే ఉద్దేశంతో పోలీస్ కస్టడీ కోరడంపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది:
చట్ట ప్రకారం ఏదైనా కేసులో బెయిల్ మంజూరైన తర్వాత పోలీస్ కస్టడీ కోరడం అసాధ్యం. కేవలం పదేళ్ల కంటే ఎక్కువ శిక్ష పడే కేసుల్లో మాత్రమే, బెయిల్ వచ్చిన 45 రోజుల్లోపు పోలీస్ కస్టడీకి అనుమతి ఉంటుంది. బెయిల్ వచ్చిన ఆరు నెలల తర్వాత కస్టడీ కోరడం అత్యంత దారుణమైన నిర్ణయమని ధర్మాసనం అభిప్రాయపడింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న పోలీసుల తీరును తప్పుబడుతూ, రేవతి విషయంలో ఇకపై ఇలాంటి వేధింపు చర్యలకు వీలులేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
