‘పేదలకు ఒక న్యాయం, పెద్దలకు ఒక న్యాయమా?’ అంటూ న్యాయమూర్తి ఆగ్రహం.
బలగం టీవీ, హైదరాబాద్:
హైదరాబాద్‌లోని గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ (గీతం) యూనివర్సిటీకి ఉన్న భారీ విద్యుత్ బకాయిల విషయంలో తెలంగాణ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. యూనివర్సిటీ చెల్లించాల్సిన రూ.118.13 కోట్ల పెండింగ్ విద్యుత్ బకాయిలపై విద్యుత్ శాఖ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై న్యాయమూర్తి జస్టిస్ నగేష్ భీమపాక ఆగ్రహం వ్యక్తం చేశారు.
“సామాన్యులకు ఒక చట్టం, డబ్బు ఉన్న వాళ్లకు ఒక చట్టం రూపొందించారా?” అంటూ కోర్టు ప్రశ్నించింది. తన చిన్నతనంలో రూ.800 బిల్లు చెల్లించకపోతే తన ఇంటికి విద్యుత్ సరఫరా నిలిపివేశారని గుర్తుచేస్తూ, “పేదలకు ఒక న్యాయం, పెద్దలకు ఒక న్యాయం ఉంటుందా?” అని హైకోర్టు న్యాయమూర్తి మండిపడ్డారు.
విద్యుత్ కనెక్షన్ తొలగించకుండా అధికారులు కాలయాపన చేస్తున్నారా అని ప్రశ్నించారు. పదవుల్లో ఉన్న వారి పట్ల అధికారులు ఇలా వ్యవహరిస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని జస్టిస్ నగేష్ భీమపాక తీవ్రంగా హెచ్చరించారు.
ఈ విషయంపై వివరణ ఇవ్వాల్సిందిగా టీజీఎస్పీడీసీఎల్ (TSSPDCL) సూపరింటెండెంట్ ఇంజనీర్‌ను స్వయంగా కోర్టుకు హాజరుకావాల్సిందిగా ఆదేశించారు. తదుపరి విచారణను ఈ నెల 22వ తేదీకి కేసును వాయిదా వేసిన హైకోర్టు.
