అక్రమ రవాణాను అడ్డుకుని ఎస్సై ట్రాక్టర్లను సీజ్ చేయడంతో బయటపడ్డ బాగోతం
అదుపులోకి తీసుకున్న కాంగ్రెస్ నేతను విడుదల చేయాలని ఒత్తిడి
కాంగ్రెస్ ముఖ్య నేత ఫోన్ కాల్ తో వదిలేసిన పోలీసులు?
రాజన్న సిరిసిల్ల, బలగం టీవీ:
రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గంలో మళ్లీ ఇసుక మాఫీయాకు కాంగ్రెస్ నేతలు దారులు వేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇసుక కొరతతో ఆకాశన్నంటిన ఇసుక ధరలను అదునుగా చూసుకోని ఓ కాంగ్రెస్ నేత ఇసుక స్మగర్లతో చేతులు కలిపి.. పోలీసుల పేరు చెప్పి అక్రమంగా డబ్బులు వసూలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. వివరాల్లోకి వెళితే.. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గంలోని సిరిసిల్ల పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని ఒక మండలంలో ఎస్సై పేరు చెప్పి కాంగ్రెస్ నేత ఇసుక ట్రాక్టర్ ఓనర్ల వద్ద వేలాది రూపాయాలు వసూలు చేసినట్లు తెలిసింది. ఇసుక అక్రమ రవాణా విషయం తెలిసిన ఎస్సై దాడులు చేసి ట్రాక్టర్లను సీజ్ చేయడంతో సర్ మేం డబ్బులిచ్చి ఇసుక రవాణా చేస్తున్నం.. మీ పేరు చెబితేనే డబ్బులిచ్చాం అని ట్రాక్టర్ ఓనర్లు, ఇసుక రవాణదారులు ఎస్సై కి పేర్కొనడంతో.. కోపంతో సదరు కాంగ్రెస్ నేతను అదుపులోకి తీసుకొని నాలుగు గంటల పాటు పోలీస్ స్టేషన్లు విచారించినట్లు తెలిసింది. దీంతో కాంగ్రెస్ ముఖ్య నేతలకు విషయం తెలిసి.. ఎస్సైకి ఫోన్ చేసి వదిలేయాలని ఒత్తిడి తేవడంతో వదిలేసినట్లు సమాచారం.
ఇసుక ను బ్లాక్ చేసి సొమ్ము చేసుకుంటున్న నేతలు
రాజన్న సిరిసిల్ల జిల్లా లో ఇసుకను బ్లాక్ చేసి కొంత మంది కాంగ్రెస్ నేతలు వసూళ్ల పర్వం మీద పడ్డట్ల ఆరోపణలు వస్తున్నాయి. సిరిసిల్ల నియోజకవర్గంలో 15 రోజులకు ఒకసారి ఇసుక వేబిల్లులు ఇవ్వడంతో ఇందిరమ్మ ఇండ్లతో పాటు ప్రైవేట్ నిర్మాణాలు కూడా నిలిచిపోతున్నాయి. బ్లాక్ లో ఇసుక ట్రిపు ధర రూ.5000 వరకు పలుకుతుంది. దీనిని అదునుగా తీసుకోని కొంత మంది కాంగ్రెస్ నేతలు వసూళ్ల పర్వం మీద పడుతున్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నారు. ఇటువంటి అవినీతి కాంగ్రెస్ నేతలకు ముఖ్య నేతలు సపోర్ట్ చేయడం తీవ్ర విమర్శలకు దారి తీస్తుంది. ఉదయం లేస్తే గత ప్రభుత్వం ఇసుక మాఫీయా చేసింది అని ప్రెస్ మీట్లు పెట్టే నాయకులు అక్రమ వసూళ్లకు పాల్పడ్డ తమ అనుచరులకు సపోర్ట్ చేసి విడిపించారని చర్చ కొనసాగుతుంది. పోలీసులు కూడా కాంగ్రెస్ నేత ఒత్తిళ్లకు తలొగ్గి వదిలేశారని ఆరోపణలు వస్తున్నాయి.
విచారణ జరిపాం.. ఎస్సై..
ఈ సంఘటనపై సదరు మండల ఎస్సైని వివరణ కోరగా.. ఈ అక్రమ వసూళ్లు విషయం తన దృష్టికి వచ్చిందని.. రామస్వామి అనే వ్యక్తి ఇచ్చినట్లు ప్రాథమిక సమాచారం రాగా ఆరోపణలు వచ్చిన వ్యక్తిని పిలిచి విచారణ చేశానన్నారు. ఫోన్ ఫే లో రూ.10 వేలు కొట్టినట్లు ఉన్నాయని, ఈ డబ్బులు ఇసుక రవాణ కోసం కాదు అని మళ్లీ చెప్పడంతో వదిలేశామన్నారు. ఆ డబ్బులు కూడా వాపస్ కొట్టారని పేర్కొనడం విశేషం. ఈ విషయం జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు తెలియడంతో విచారణ చేస్తున్నట్లు సమాచారం.
